యాదాద్రిలో చేతబడి పేరుతో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. చేతబడి చేసి తన సోదరుడిని చంపిందన్న అనుమానంతో ఓ వ్యక్తి బుజ్జి అనే మహిళను దారుణంగా హతమార్చాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ్ పూర్ మండలంలో కలకలం రేపింది. 

వివరాల ప్రకారం... మండలంలోని గాంధీనగర్ తండాకు చెందిన నేనవత బుజ్జి(45), గన్నా భార్యభర్తలు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బండనేమురు గ్రామంలో వీరికో ఫంక్షన్ ఉంది. దీనికోసం బుజ్జి, గన్నా... గన్నా తల్లి రాగమ్మలు బయల్దేరారు. అయితే గన్నా తన తల్లి రాగమ్మను తన బైక్ మీద కూర్చో బోట్టుకున్నాడు. భార్య బుజ్జి తెలిసి వాళ్ల బైక్ మీద ఫంక్షన్ కు బయల్దేరారు. 

వీరు వెడుతుండగా దారిలో గాంధీనగర్ తండాకే చెందిన మోగవత్ నర్సింహ బుజ్జి ఎక్కిన టూవీలర్ ను ఆపాడు. బైక్ నడుతున్న వ్యక్తిని కొట్టి, బుజ్జిని తన కారులో బలవంతంగా ఎక్కించుకున్నాడు. ఆమెను రాజకొండ అటవీ ప్రాంతానికి తీసుకుపోయి చీరతో ఉరేసి హత్య చేశాడు. 

తాము చేరుకున్నా ఎంత సేపటికీ భార్య రాకపోవడంతో వెతుక్కుంటూ గన్నా వెనక్కివచ్చాడు. ఈ కిడ్నాప్ విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వెంకటయ్య, ఎస్‌ఐ నాగరాజులు బుజ్జి కోసం గాలించారు. రాచకొండ అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. హత్యచేసిన తరువాత నర్సింహ పోలీస్‌సేష్టన్‌లో లొంగిపోయాడు.

మోగవత్ నర్సింహ తమ్ముడు రాజేష్ గత డిసెంబర్ 30న కరెంట్ షాక్ తో చనిపోయాడు. అయితే బుజ్జి చేతబడి చేయడం వల్లే చనిపోయాని నర్సింహ కక్ష పెంచుకున్నాడు. సమయం చూసుకుని ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన తరువాత బుజ్జి బంధువులు సంస్థాన్‌నారాయణపురం పోలీస్‌ సేష్టన్‌ ముందు ఆందోళన చేపట్టారు.