Asianet News TeluguAsianet News Telugu

యూపీ సీఎం యోగి బాటలోనే... బుల్డోజర్ తో బిజెవైఎం నేత హల్ చల్, మల్కాజ్ గిరిలో ఉద్రిక్తత (వీడియో)

ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ ప్రయోగాన్ని తెలంగాణ బిజెవైఎం నాయకుడు సాయి ప్రసాద్ అనుసరించాడు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే అక్రమాస్తులంటూ కొన్ని నిర్మాణాలను కూల్చివేసే ప్రయత్నం చేసాడు. 

BJYM Leader Sai Prasad hul chal with bulldozers in Malkajgiri AKP
Author
First Published Sep 13, 2023, 5:02 PM IST

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో తెలంగాణలో రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఇప్పటికే ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లిపోయిన అధికార బిఆర్ఎస్, ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రచార జోరు పెంచాయి. దీంతో ఆయా పార్టీలు, నాయకుల మధ్య మాటల యుద్దం ముదిరి దాడులకు దారితీస్తోంది. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ లో యోగి సర్కార్ అనుసరిస్తున్న బుల్డోజర్ విధానాన్నే తెలంగాణ బిజెపి కూడా అమలుచేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆక్రమించుకున్నాడంటూ   బుల్డోజర్లతో కూల్చివేసే ప్రయత్నాలు జరిగాయి.  బిజెవైఎం జాతీయ కోశాధికారి సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో మైనంపల్లి ఆస్తుల విధ్వంసానికి బుల్డోజర్లు కదిలాయి.

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి రౌడీయిజం, భూకబ్జాలను బయటపెట్టేందుకంటూ బిజెపి యువనేత సాయి ప్రసాద్ భారీ బైక్ ర్యాలీ ఏర్పాటుచేసారు. 'జాగో మల్కాజ్‌గిరి' పేరిట దాదాపు 1500 బైక్స్ తో ఈ యాత్ర నియోజకవర్గం మొత్తం సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కబ్జా చేసిన ఆస్తులంటూ కొన్ని భవనాలపై పబ్లిక్ ప్రాపర్టీ అంటూ రాయించారు. ఇక ఆల్వాల్ రాక్ ల్యాండ్ అవెన్యూ వెలిసిన భూములు హనుమంతరావు కబ్జాచేసినవి అంటూ కమాన్ బోర్డు ధ్వంసం చేసేందుకు బిజెపి శ్రేణులు ప్రయత్నించాయి. రాక్ ల్యాండ్ అవెన్యూ ఆఫీస్, కమాన్ బోర్డ్ బుల్డోజర్ తో కూల్చేందుకు సాయి ప్రసాద్ వర్గం సిద్దమవగా పోలీసులు అడ్డుకున్నారు. 

వీడియో

ఎమ్మెల్యే మైనంపల్లి అనుచరులు కూడా రాక్ ల్యాండ్ అవెన్యూ వద్దకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాయి ప్రసాద్ నేతృత్వంలోని బిజెపి శ్రేణులపై మైనంపల్లి అనుచరులు దాడికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి చేయిదాటుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువర్గాలను అక్కడినుండి చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసారు. 

Read More  కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది: కిష‌న్ రెడ్డి

ఈ సందర్భంగా బిజెవైఎం నేత సాయి ప్రసాద్ మాట్లాడుతూ... అధికార పార్టీ అండతో ఎమ్మెల్యే మైనంపల్లి పేదల  భూములు కబ్జా చేసాడని ఆరోపించారు. ఈ అన్యాయంపై ప్రశ్నించిన వారిపై మైనంపల్లి అనుచరులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. 'మైనంపల్లి హఠావో-బిజెపి బచావో' నినాదంతో పోరాటం కొనసాగిస్తామని బిజెవైఎం నేత సాయిప్రసాద్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios