Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ బిజెపిదే ... మరి కాంగ్రెస్, బిఆర్ఎస్ పరిస్థితి..? : ప్రశాంత్ కిషోర్ అనాలిసిస్

తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు, త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు చాలా వ్యత్యాసం వుంటుందని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తెలిపారు. బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఏ స్థానంలో వుంటాయో అంచనా వేసాడు పికె. ఆయన అభిప్రాయం ఇలా వుంది....

BJP will be first or second place in Telangana lok Sabha Elections 2024 : Prashant Kishor AKP
Author
First Published Apr 9, 2024, 1:54 PM IST

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డిఏ కూటమి 'అబ్ కి బార్... చార్ సౌ పార్ (ఈసారి నాలుగు వందలకు పైగా ఎంపీ సీట్లు)'' అన్న నినాదంలో ఎన్నికలకు వెళుతోంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని INDI Alliance మాత్రం ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా ఒక్కతాటిపైకి రాలేకపోతున్నాయి. దీంతో ముచ్చటగా మూడోసారి కూడా బిజెపి గెలిచి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసారి బిజెపి ఉత్తరాదినే కాదు దక్షిణాదిన కూడా సత్తా చాటుతుందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ముఖ్యంగా తెలంగాణలో బిజెపి అద్భుతాలు చేస్తుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అనుకున్న స్థాయిలో సీట్లు సాధించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సాధించి అధికారంలోకి రాగా బిఆర్ఎస్ రెండోస్థానంలో నిలిచి ప్రధాన ప్రతిపక్షంగా మారింది. బిజెపి కేవలం ఎనిమిది సీట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా లోక్ సభ ఎన్నికల్లో పరిస్థితి వుండదని... మోదీ హవా, హిందుత్వ పాలిటిక్స్ ప్రభావం తెలంగాణలో బలంగా వుంటుందని అంచనా వేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే బిజెపి అత్యధిక సీట్లు సాధిస్తుందని అంటున్నారు... ఇదే అభిప్రాయాన్ని ప్రశాంత్ కిషోర్ కూడా వ్యక్తం చేసారు. 

కేవలం తూర్పు, ఉత్తర భారతదేశంలోనే కాదు ఈసారి పశ్చిమ, దక్షిణ భారతదేశంలోనూ బిజెపి మంచి ఓట్లు, అధిక సీట్లు సాధిస్తుందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో బిజెపి అత్యధిక ఎంపీ సీట్లు సాధిస్తుందని... కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తుందని తెలిపారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలే మొదటి రెండు స్థానాల్లో నిలుస్తాయని... బిఆర్ఎస్ పోటీలో వుండకపోవచ్చని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. గత లోక్ సభ ఎన్నికల్లో కంటే మెరుగైన ప్రదర్శన బిజెపి చేస్తుందని... అత్యధిక సీట్లతో మొదటిస్థానంలో నిలిచే అవకావాలు కూడా వున్నాయన్నారు. 

Hyderabad : అసదుద్దీన్ ఓవైసిపై ఆడబిడ్డ పోటీ? ఎవరీ మాధవీలత?

ప్రశాంత్ కిషోర్ విశ్లేషనే నిజమైతే బిఆర్ఎస్ కే కాదు కాంగ్రెస్ పార్టీకి కూడా గడ్డుకాలం మొదలైనట్లే. ఇప్పటికే తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిఆర్ఎస్, బిజెపి కుట్రలు పన్నుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ లోక్ సభ ఎన్నికల్లో ఫలితం బెడిసికొడితే కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ప్రమాదంలో పడే అవకాశం వుంది. బిఆర్ఎస్ పార్టీకి కూడా బిజెపి గెలుపు ప్రమాదమే. 

ఇదిలావుంటే బిజెపి ఎక్కడయితే వీక్ గా అక్కడ బలం పుంజుకుంటుందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిషాలో నెంబర్ వన్ ప్లేస్ కు చేరుకుంటుందని అన్నారు. బిహార్ లో కూడా బిజెపికి చాలామంచి ఫలితాలు వస్తాయన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో గతంలో కంటే మెరుగైన ప్రదర్శన బిజెపి చేస్తుందన్నారు. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో కూడా బిజెపి మిత్రపక్షం టిడిపి అధికసీట్లు సాధిస్తుందని... ఈసారి జగన్ కు కష్టమేనని ప్రశాంత్ కిషోర్ అన్నారు. 

అయితే బిజెపి ఒంటరిగా 370 సీట్లు సాధించే అవకాశాలు లేవని... 300 కు పైగా సీట్లు మాత్రం సాధించవచ్చని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. కానీ ఎన్డీఏ కూటమి 400కు పైగా ఎంపీ సీట్లు సాధిస్తుందన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత చిన్నచిన్న పార్టీలు ఎన్డీఏలో చేరతాయి... కాబట్టి 400 పైగా సీట్లు సాధ్యమన్నారు. ఇలా బంపర్ మెజారిటీతో మరోసారి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని... హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టిస్తాడని ప్రశాంత్ కిషోర్ విశ్లేషణ చెబుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios