బీఆర్ఎస్‌పై పోరులో టీ బీజేపీ వెనకడుగు.. రివర్స్ అటాక్‌‌ మాటేమిటి?.. తెర వెనక ఏం జరిగింది..?

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటంలో బీజేపీ ఓ అడుగు వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని అధికారికంగా ప్రకటించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆ ప్రణాళికలను విరమించుకున్నట్టుగా కనిపిస్తుంది.

BJP Steps Back Reverse gear attack on BRS Government ksm

హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటంలో బీజేపీ ఓ అడుగు వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని అధికారికంగా ప్రకటించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆ ప్రణాళికలను విరమించుకున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఇందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించకపోవడమే కారణంగా తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది వేడుక‌లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఇందుకు కౌంటర్‌గా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. 

21 రోజుల పాటు అధికార బీఆర్ఎస్‌పై ప్రతికూల ప్రచారం, నిరనస(రివర్స్ గేర్)లతో.. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎదురుదాడి చేయాలని ప్రణాళికలు రచించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. ఆయా  శాఖల వారీగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై చర్చించి షెడ్యూల్ కూడా విడుదల చేశారు. 

అయితే ఇప్పుడు బీజేపీ హైకమాండ్ సూచనలతో ఈ ప్రణాళికపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం వెనక్కి తగ్గినట్టుగా సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తైన సందర్భంగా మే 30 నుంచి నెల రోజుల పాటు మహా జనసంపర్క్ అభియాన్ పేరుతో బీజేపీ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తద్వారా మోదీ  ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లో తీసుకెళ్తున్నారు. అయితే ఈ క్రమంలోనే మోదీ పాలన విజయాలను ప్రజల్లోకి  తీసుకెళ్లాలని బీజేపీ హైకమాండ్.. రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సమయంలో తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై  ప్రతికూల ప్రచారం వద్దని సూచించినట్టుగా సమాచారం. 

దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం  రివర్స్ గేడర్ పేరుతో నిర్వహించాలని భావిస్తున్న కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి  తెలిసిందే. గత కొంతకాలంగా బీజేపీ నాయకులు.. అధికార బీఆర్ఎస్ పార్టీపైన, నేతలపైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కుటుంబ పాలన, అవినీతికి కేరాఫ్ అడ్రస్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ పాత్ర ఉందని.. కవిత అరెస్ట్ అవడం ఖాయమని కూడా చెప్పుకొచ్చారు. కానీ అలా జరగలేదు. 

దీంతో కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ, బీఆర్ఎస్‌లను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పిస్తుంది. ఇరు పార్టీలు లాలూచీ పడుతున్నాయని ఆరోపణలు చేస్తుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నిరసన కార్యక్రమాలను ప్రకటించి.. వెనక్కి తగ్గడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇది ఒక రకంగా కాంగ్రెస్‌ విమర్శలకు ఆయుధంగా మారనుందనే విశ్లేషణలు  కూడా వినిపిస్తున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios