హైదరాబాద్: సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంపై తెలంగాణ బీజేపీ అగ్రనేతలు కన్నేశారు. ప్రస్తుతం ఈ స్థానం నుండి  ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు పార్టీ టిక్కెట్టు నిరాకరిస్తే ఈ స్థానాన్ని ఎవరికి  కేటాయిస్తారనేది పార్టీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

సికింద్రాబాద్ పార్లమెంట్  స్థానం నుండి గత ఎన్నికల్లో టీడీపీ బిజేపీ కూటమి అభ్యర్థిగా  పోటీ చేసిన  బండారు దత్తాత్రేయ విజయం సాధించారు.  మోడీ కేబినెట్‌లో దత్తాత్రేయ మంత్రిగా పనిచేశారు. రెండున్నర ఏళ్ల తర్వాత మోడీ కేబినెట్‌ నుండి దత్తాత్రేయకు ఉద్వాసన పలికారు. పార్టీ అవసరాల రీత్యా దత్తాత్రేయను  మంత్రివర్గం నుండి తప్పించారని  అప్పట్లో పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

అయితే రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఉన్న ఒక్క కేంద్ర మంత్రి పదవిని కూడ తొలగించడంపై బీజేపీ క్యాడర్‌లో కొంత అసంతృప్తి నెలకొంది.  భవిష్యత్తులో  దత్తాత్రేయకు  మంచి పదవిని ఇస్తామని బీజేపీ నాయకత్వం  హామీ ఇచ్చిందని సమాచారం.

సికింద్రాబాద్  పార్లమెంట్ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. కానీ పార్టీ జాతీయ నాయకత్వం జోక్యం చేసుకోవడంతో గత ఎన్నికల సమయంలో నామినేషన్ల చివరి రోజున ఆఖరి నిమిషంలో అంబర్ పేట నుండి నామినేషన్ దాఖలు చేశారు. అంబర్ పేట నుండి ఆయన విజయం సాధించారు. ఈ దఫా మరోసారి అంబర్‌పేట నుండి పోటీ చేసిన కిషన్ రెడ్డి ఓటమిపాలయ్యారు.

అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి మాసంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ పార్లమెంట్‌ స్థానంపై బీజేపీ అగ్రనేతలు కన్నేశారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి  ఈ దఫా కిషన్ రెడ్డి పోటీ చేయాలని ఆసక్తిని చూపుతున్నారు. కిషన్ రెడ్డితో  పాటు చింతల రామచంద్రారెడ్డి,డాక్టర్ లక్ష్మణ్‌లు కూడ ఈ స్థానం నుండి పోటీకి ఆసక్తిగా ఉన్నారు.

సికింద్రాబాద్ నుండి ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న బండారు దత్తాత్రేయ వయస్సు రీత్యా రానున్న ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం టిక్కెట్టు ఇవ్వకపోవచ్చనే ప్రచారం కూడ పార్టీ వర్గాల్లో ఉంది.  దత్తాత్రేయ పోటీ చేయకపోతే  ఈ ముగ్గురు అగ్రనేతలు ఈ స్థానం నుండి పోటీకి సై అనే అవకాశం ఉంది.

వెంకయ్యనాయుడు తర్వాత బీజేపీలో  కిషన్‌రెడ్డికి దత్తాత్రేయ లిఫ్ట్ ఇచ్చారు. దత్తాత్రేయ సికింద్రాబాద్ నుండి పోటీ నుండి తప్పుకొంటే కిషన్‌రెడ్డికి దత్తాత్రేయ మద్దతిచ్చే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అనుచరులు  అభిప్రాయంతో ఉన్నారు.

అంబర్‌పేట సెగ్మెంట్‌లో కిషన్ రెడ్డిని గెలిపించడంలో  గతంలో దత్తాత్రేయ కీలకంగా వ్యవహరించారని చెబుతారు.చ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు స్కూటర్‌పై కిషన్‌ రెడ్డి దత్తాత్రేయను తిప్పేవారని చెబుతారు. దీంతో  సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి కిషన్ రెడ్డి పోటీ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని  చెబుతున్నారు.