వైద్య సిబ్బంది, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఎం.ఐ.ఎం నేత, నిజామాబాద్ డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్‌పై ఎంపీ ధర్మపురి అరవింద్ నిప్పులు చెరిగారు. రెడ్ జోన్ ప్రాంతంగా ఉన్న ఆటో నగర్‌లో ఓ కుటుంబ సభ్యులను క్వారన్ టైన్ తరలిస్తుండగా అడ్డుకున్న ఇద్రీస్‌ ఖాన్‌ను అరెస్ట్‌ చేయబోతున్నారా లేదా అనే దానిపై అధికారిక ప్రకటన చేయడానికి పోలీసులు నిరాకరిస్తున్నారని తెలిపారు. 

అతన్ని అరెస్ట్‌ చేసినట్టు చెబుతున్నా ఎఫ్‌ఐఆర్‌ వివరాలు ఎందుకు వెల్లడించడం లేదన్నారు. కేవలం హెచ్చరించి ఎలాంటి కేసు నమోదు చేయకుండానే వదిలేశారని స్పష్టంగా అర్థం అవుతోందన్నారు.

ఇలాంటి ఘటనలు ఇదే మొదటిసారి కాదని, ఇంతకు ముందు కూడా ఎం.ఐ.ఎం నేతలు కరోనా వైద్యసిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. వారి స్వభావం వల్ల రాష్ట్రంలో కరోనా వ్యాధి మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని మండిపడ్డారు.