మెదక్ పారిపోవద్దు: కవితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
ఎన్నికల్లో కుస్తీ, ఎన్నికల తర్వాత దోస్తీ చేయడం బీఆర్ఎస్, కాంగ్రెస్ ల నేజమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు.
నిజామాబాద్: కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నుండి పోటీ చేయాలని బీజేపీ ఎంపీ అరవింద్ కోరారు. నిజామాబాద్ నుండి కాకుండా మెదక్ కు పారిపోవద్దని అరవింద్ ఆమెను కోరారు. గురువారంనాడు బీజేపీ ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడారు. ప్యాకేజీ కోసం కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారన్నారు. కల్వకుంట్ల కుటుంబం ఓ రోగమని ఆయన పేర్కొన్నారు., దానికి విరుగుడు బీజేపీయేనని ఆయన చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని అరవింద్ విమర్శించారు.
ఎన్నికల్లో కొట్లాడి పోలింగ్ ముగియగానే బీఆర్ఎస్, కాంగ్రెస్ దోస్తీ కడుతుందని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ లో గెలిచినోళ్లు బీఆర్ఎస్ లో చేరుతారన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు మార్పునకు ఓటేస్తారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
2014 ఎన్నికల్లో నిజామాబాద్ నుండి కవిత విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఇదే స్థానం నుండి పోటీ చేసిన కవిత బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. రానున్న ఎన్నికల్లో కవిత నిజామాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది.