న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నీరో చక్రవర్తిలా పాలన కొనసాగిస్తున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. 

లోక్ సభ జీరో అవర్ లో తెలంగాణలో సంచలనం సృష్టించిన ఇంటర్ ఫలితాల అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రస్తావించారు. ఇంటర్ ఫలితాల అవకతవకలపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో ఇప్పటికీ వివరణ ఇవ్వలేదని విమర్శించారు. 

విద్యను కేవలం వ్యాపార దృక్పథంతో కేసీఆర్ చూస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. అనుభవం లేని గ్లోబరీనా సంస్థకు ఫలితాల విడుదల బాధ్యతను అప్పగించి విద్యార్థుల చావులకు కారణం అయ్యారంటూ మండిపడ్డారు. 

ఇంటర్ ఫలితాల అవకతవకలపై ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక ఇచ్చినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని తెలిపారు బండి సంజయ్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గవర్నర్ నరసింహన్ నిక్కచ్చిగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.