తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ పాత్ర ఎంతో కీలకమైనదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ.. తెలంగాణలో ధర్నాలు ఉండవని చెప్పిన కేసీఆర్ ఏకంగా ధర్నా చౌక్‌నే ఎత్తేశారని మండిపడ్డారు. కార్మికుల న్యాయమైన కోరికలు తీర్చితేనే అసలైన పండుగని.. దసరా పండుగ పేరుతో కార్మికులపై వ్యతిరేకత తెచ్చే ప్రయత్నం చేశారని ఆయన ఎద్దేవా చేశారు.

సమ్మె న్యాయమైనదని.. ఒకేసారి ఇంతమంది ఉద్యోగులను తీసివేసే అధికారం ముఖ్యమంత్రికి లేదని రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ గతంలో తీసుకున్న సగం నిర్ణయాలను న్యాయస్థానం కొట్టివేసిందని ఆయన గుర్తు చేశారు.

నష్టాలు వచ్చినా ప్రభుత్వం ఆర్టీసీని నడిపించాలని.. ఇది లాభాలు తెచ్చే సంస్థ కాదన్న సంగతిని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఆర్టీసీ కార్మికులకు అవసరమైన న్యాయ సహాయాన్ని చేస్తానని రామచంద్రరావు హామీ ఇచ్చారు.