నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహ ఏర్పాటు సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పోలీసులు శివాజీ విగ్రహానికి రక్షణ కల్పించాలని కోరారు. విగ్రహాన్ని కూలిస్తే అదే ప్రాంతంలో మరో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రాజాసింగ్ స్పష్టం చేశారు.
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహ ఏర్పాటు రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (raja singh) మాట్లాడుతూ.. శివాజీ విగ్రహానికి పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులు భయానక వాతావరణం సృష్టించొద్దని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. విగ్రహాన్ని తొలగిస్తే అక్కడే ఏర్పాటు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎంతోమంది హిందువులను చంపిన వ్యక్తి టిప్పు సుల్తాన్ అంటూ ఫైరయ్యారు. దేశం కోసం , ధర్మం కోసం కొట్లాడిన ఒకే ఒక్క వ్యక్తి ఛత్రపతి శివాజీ అని రాజాసింగ్ కొనియాడారు. పోలీసులు రక్షణ కల్పించని పక్షంలో హైదరాబాద్ నుంచి బోధన్‌కు చేరుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆ పరిసరాల్లో వున్న హిందువులను ఏకం చేస్తామన్నారు.
కాగా.. బోధన్‌లో రాత్రికి రాత్రే శివసేన, బీజేపీ కార్యకర్తలు శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. మైనారిటీ నాయకులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన చోట బైఠాయించిన మైనార్టీ నాయకులు.. విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన చోటుకు ఇరువర్గాల నాయకులు, స్థానికులు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు ఎంతగా నచ్చజెప్పినా ఇరువర్గాలు వినిపించుకోవడం లేదు. దీంతో బోధన్‌లో భారీగా పోలీసులు మోహరించారు. ఎటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
పరిస్థితి ఉద్రిక్తం..
ఈ క్రమంలోనే పలువురు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో అక్కడి పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు భోదన్‌లో 144 సెక్షన్ (144 section) విధించారు. అయితే బోధన్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని సీపీ వెల్లడించారు. శివాజీ విగ్రహానికి అనుమతి లేదని చెప్పారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే సహించబోమని హెచ్చరించారు. బోధన్ పట్టణంలో పికెటింగ్ కొనసాగుతుందని... గొడవకు కారణమైన రెండువర్గాలపై కేసులు పెట్టామని, పలువురి అదుపులోకి తీసుకున్నట్లు సీపీ వెల్లడించారు.
ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ (bjp) అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) స్పందించారు. బోధన్‌లో (bodhan ) హిందువులపై దాడిని ఖండిస్తున్నామన్నారు. హిందు యువకులపై ఎంఐఎం , టీఆర్ఎస్ (trs), పోలీసులు కలిసి దాడి చేశారని సంజయ్ ఆరోపించారు. బోధన్‌లో శివాజీ విగ్రహం పెట్టడం (chhatrapati shivaji) కోసం మున్సిపల్ కౌన్సిల్ ఆరు నెలల క్రితమే తీర్మానం చేసిందన్నారు. ఆ తీర్మానం ప్రకారం విగ్రహం పెడితే అడ్డుకుంటారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. రాళ్ల దాడి చేయడం మూర్ఖత్వమన్నారు. భైంసాలో జరిగినట్లే.. బోధన్‌లోనూ జరుగుతోందని ఆరోపించారు.
హిందువులకు తాము అండగా వుంటామని బండి సంజయ్ స్పష్టం చేశారు. శివాజీ పాక్ నుంచి లేదా బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చారా అని ఆయన ప్రశ్నించారు. శివాజీ విగ్రహం ఎందుకు పెట్టకూడదో సీపీ చెప్పాలని బండి సంజయ్ నిలదీశారు. నిజామాబాద్ సీపీ గతంలో ఎంపీ అవుతానని చెప్పాడని ఆయన గుర్తుచేశారు. సీఎం ఆశీస్సుల కోసం కొందరు ఐఏఎస్‌లు పనిచేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. పోలీసులు టీఆర్ఎస్ ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
