హైదరాబాద్: నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో విజయశాంతిని బరిలోకి దింపే ఆలోచనలో బిజెపి నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను పోటీకి దించే విషయంపై పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. సినీ గ్లామర్ తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద చేస్తున్న విమర్శల దాడి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కలిసి వస్తుందని భావిస్తున్నారు. 

విజయశాంతిని నాగార్జునసాగర్ లో పోటీకి దించాలని బిజెపి జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె పేరును రాష్ట్ర నాయకత్వం పరిశీలిస్తోంది. దీనిపై బిజెపి ఓ అంతర్గత సర్వే కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. 

నిరుడు డిసెంబర్ 7వ తేదీన విజయశాంతి బిజెపిలో చేరారు. ప్రస్తుత స్థితిలో నాగార్జునసాగర్ బరిలోకి దింపడానికి ఆమె పేరను జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర పార్టీకి సూచించడం ఆసక్తికరంగా మారింది. 

నాగార్జునసాగర్ బరిలో కాంగ్రెసు నుంచి కుందూరు జనారెడ్డి ఉండడం దాదాపుగా ఖరారైంది. టీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతితో నాగార్జునసాగర్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. 

దుబ్బాక ఉప ఎన్నికలో సాధించిన విజయంతో బిజెపి ఊపు మీద ఉంది. అదే స్థాయిలో నాగార్జునసాగర్ లో పోటీ ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో విజయశాంతి గ్లామర్, దూకుడు పనికి వస్తుందని బిజెపి భావిస్తోంది.