రక్షణ శాఖకు సంబంధించి రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ఆరోపణలు ఆపాలంటూ తెలంగాణ బిజెపి ఆద్వర్యంలో హైదరాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ ముందు బిజెపి నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. దీంతో గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  

రాఫెల్ డీల్ లో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఇటీవలే సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవించకుండా మళ్లీ ఆరోపణలకు దిగుతున్నారని బిజెపి నాయకులు తెలిపారు. అందువల్లే ఈ  ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. 

రాఫెల్ యుద్ద విమానాల కొనుగోళ్లపై ప్రాన్స్ తో జరిగిన ఒప్పందంలో బిజెపి ప్రభుత్వం భారీ అవినీతి పాల్పడిందని ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గత కొద్ది రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రధాని మోదీని టార్గెట్ గా చేసుకుని రాహుల్ విమర్శలు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కూడా రాహుల్ రాఫెల్ ఒప్పందాన్ని గుర్తు చేస్తూ మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.  

రాఫెల్ డీల్ విషయంలో ఇప్పటివరకు బిజెపిపై అసత్య ప్రచారం, మోదీపై రాజకీయ విమర్శలు చేసిన నాయకులు వెంటనే క్షమాపణ చెప్పాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్,  మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు. 

బిజెపి ధర్నాతో గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బిజెపి నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.