మెదక్‌లో శుక్రవారం భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చిన చలో కలెక్టరేట్‌ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గొల్లకురుమల సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో మెదక్‌ పట్టణంలో రణభేరి, చలో కలెక్టరేట్ నిర్వహించారు.

స్థానిక జీకేఆర్ గార్డెన్స్‌లో తొలుత రణభేరి కార్యక్రమం జరిగింది. అనంతరం అక్కడ నుంచి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ నేతలు కలెక్టరేట్‌కు బయలుదేరారు.

ఈ క్రమంలో ఈ ర్యాలీ స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వద్దకు చేరుకోగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో బీజేపీ నేతలకు,  పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

పోలీసులు వారిని ఎంత వారించినా బీజేపీ నేతలు, కార్యకర్తలు ముందుకు దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకుగాను లక్ష్మణ్‌, రఘునందన్‌ రావు సహా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు.