విజయేందర్‌రెడ్డి కుటుం బం మొదటి నుంచీ బీజేపీకి అండగా ఉంది. ఆయన తండ్రి ఎడవెల్లి జగ్గారెడ్డి జనసంఘ్, ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగాల్లో పనిచేశారు. 

బీజేపీ సీనియర్ నేత డాక్టర్ ఎడవెల్లి విజయేందర్ రెడ్డి.. టీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. ఎన్నో సంవత్సరాలుగా బీజేపీలో కొనసాగుతున్న ఆయన.. సడెన్ గా కారు ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. విజయేందర్‌రెడ్డి కుటుం బం మొదటి నుంచీ బీజేపీకి అండగా ఉంది. ఆయన తండ్రి ఎడవెల్లి జగ్గారెడ్డి జనసంఘ్, ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగాల్లో పనిచేశారు. బీజేపీ జాతీయ రాష్ట్ర నాయకత్వానికి సుపరిచితులు కావడంతో 1991లో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 1,75,000 ఓట్లకు పైగా సాధిం చి మూడో స్థానంలో నిలిచారు.

2004లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ పాలక మండలి సభ్యులుగా కొనసాగారు. కొంత కాలం కాంగ్రెస్‌ను వీడి స్తబ్దుగా ఉన్న ఆయన మళ్లీ బీజేపీలో చేరారు. 2014లో కరీంనగర్‌ బీజేపీ శాసనసభ అభ్యర్థిగా టికెట్‌ ఆశించి భంగపడ్డారు. హుస్నాబాద్‌ శాసనసభ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం టికెట్‌ ఇవ్వడంతో పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదు. కరీంనగర్‌ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో కేసీఆర్‌ సమక్షంలో త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

‘‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సమర్థవంతమైన పరిపాలన, అభివృద్ధి జరుగుతోంది. కేసీఆర్‌తో పోల్చుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో మిగతా పార్టీలకు సరైన నాయకత్వం లేదు. అందుకనే కేసీఆర్‌ పరిపాలన దక్షతా, శక్తి సామర్థ్యాలపై విశ్వాసంతో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నా. కరీంనగర్‌ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ద్వారా సమయం తీసుకుని త్వరలోనే కేసీఆర్‌ను కలిసి పార్టీలో చేరుతా’’ అని ఆయన ప్రకటించారు.