Asianet News TeluguAsianet News Telugu

ప్రజలు బలౌతున్నారు.. కేసీఆర్ పై విజయశాంతి ఫైర్

కేసీఆర్ దొరవారి హామీతో సన్న వడ్లు పండించిన పాపానికి మద్దతు ధర సైతం దక్కని పరిస్థితుల్లో ఆ రైతులు తమ పంటను పక్క రాష్ట్రాలకు అమ్ముకుని బతకాల్సి వచ్చింది. వీరికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొనుగోళ్లు లేక మక్క రైతులు రోడ్డుకెక్కారు,

BJP Leader Vijayashanthi fire on KCR in twitter
Author
Hyderabad, First Published Dec 23, 2020, 12:59 PM IST

తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరు సరిగాలేదని.. దేశవ్యాప్తంగా చులకన చేసే విధంగా ఉందని ఆమె ఆరోపించారు.

ఆమె బుధవారం ట్విటర్‌ వేదికగా సీఎం కేసీఆర్‌పై పాలనపై విమర్శలు గుప్పించారు.‌ ‘సీఎం కేసీఆర్ దొరగారు ఉద్యమకాలంలోను, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు పిట్టలదొర కబుర్లే తప్ప చిత్తశుద్ధి ఏ మాత్రం లేదని తేలిపోయింది. కేసీఆర్ దొరవారి హామీతో సన్న వడ్లు పండించిన పాపానికి మద్దతు ధర సైతం దక్కని పరిస్థితుల్లో ఆ రైతులు తమ పంటను పక్క రాష్ట్రాలకు అమ్ముకుని బతకాల్సి వచ్చింది. వీరికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొనుగోళ్లు లేక మక్క రైతులు రోడ్డుకెక్కారు, అన్నదాతలు తమ పంటలకు మంట పెట్టుకున్నారు. మీరిచ్చిన ఉద్యోగాల హామీని నమ్ముకున్న పలువులు అమాయక నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడ్డారు’ అని విజయశాంతి పేర్కొన్నారు.

‘వివిధ ప్రాజెక్ట్‌ల నుంచి తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా విషయంలో సైతం కేసీఆర్ సర్కారు విఫలమైంది. మొత్తంగా చూస్తే, అటు ఉద్యమ కాలంతో పాటు పాలనా పగ్గాలు అందుకున్న నాటి నుంచీ కేసీఆర్ చెబుతూ వచ్చిన ‘మా నీళ్లు మాకు... మా ఉద్యోగాలు మాకు’ అనే నినాదం, ఆయన (కేసీఆర్‌) అధికారానికి వచ్చినా సాకారం కాని దారుణ పరిస్థితిలో రాష్ట్రం ఉంది. ఇక భూసంస్కరణలంటూ కేసీఆర్ సర్కారు ప్రారంభించిన ధరణి వెబ్ సైటు చుక్కలు చూపిస్తోంది. ఇవిగాక డబుల్ బెడ్రూములు, దళితులకు మూడెకరాలు, తాజాగా వరదసాయం, మీ నేతల కబ్జాలు, అవినీతి... ఇలా చెప్పుకుంటూ పోతే టీఆరెస్ వైఫల్యాల వరుసక్రమానికి ఆకాశమే హద్దు. మీరిచ్చే హామీలన్నీ ఓట్ల కోసం వేసే గాలాలేనని ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. మీరు వారి మధ్యకెళ్లినప్పుడల్లా దుబ్బాక, జీహెచ్ఎంసీలను గుర్తు చేస్తూనే ఉంటారు’ అని విజయశాంతి ధ్వజమెత్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios