తెలంగాణలో త్వరలో సాధువుల పాలన వస్తుందని శ్రీపీఠం పీఠాధిపతి, బిజెపి నాయకులు పరిపూర్ణానంద జోస్యం చెప్పారు. ఈ పాలనలో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఇవాళ కూకట్ పల్లి, మూసాపేట బిజెపి అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొన్న ఆయన పైవిధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బాధ్యతాయుతంమైన రాజ్యాంగ పదవిలో వున్న వ్యక్తి 15 నిమిషాల్లో హిందువులందరిని అంతం చేస్తానని బెదిరిస్తుంటే...అతడికి టీఆర్ఎస్ పార్టీ వెనకేసుకు వస్తోందని  పరిపూర్ణానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓటేయకూడదని ఆయన ప్రజలకు సూచించారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినవారంతా నిజాంకు ఓటేసినట్లేనని, మరో
పార్టీ కాంగ్రెస్ కు వేస్తే మూసీలో ఓటు గుమ్మరించినట్లేనని  సెటైర్లు వేశారు. 

ఇక శనివారం కేటీఆర్ కూకట్ పల్లిలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారితో సమావేశమవడంపై పరిపూర్ణానంద స్పందించారు. అవసరాన్ని బట్టి కేసీఆర్, కేటీఆర్ లు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారిని వాడుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ హైదరాబాద్ లో నివసించే ఆంధ్రా వారంతా సెటిలర్లంటూ గతంలో బెదరగొడితే... ఇప్పుడు వారి ఓట్ల కోసం కేటీఆర్ తమ వారేనంటూ బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నాడని అన్నారు. అయితే వారి మాటలను ప్రజలు విశ్వసించే దశలో లేరని పరిపూర్ణానంద పేర్కొన్నారు.