తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన పోవాలనే ఏకైక లక్ష్యంతో తాను బీజేపీలో చేరినట్టుగా మాజీ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తాను ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లలేదని.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లానని తెలిపారు.

తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన పోవాలనే ఏకైక లక్ష్యంతో తాను బీజేపీలో చేరినట్టుగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తాను ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లలేదని.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లానని తెలిపారు. తాను తిరిగి కాంగ్రెస్‌లో చేరతానని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారంపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్టుగా చెప్పారు. అందులో ఎలాంటి నిజం లేదని చెప్పారు. 

తాను కాంగ్రెస్ చేరతానని చెప్పకపోయినా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై తనకు అభిమానం ఉందని.. కానీ దేశంలో కాంగ్రెస్ బలహీనపడిందని అన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కొలేక.. మునుగోడు ఎన్నికల సమయంలో 18 వేల కోట్లకు అమ్ముడుపోయానని రేవంత్ రెడ్డి, కేటీఆర్ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. మునుగోడు ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికి తెలుసునని.. అక్కడ నైతిక విజయం తనదేనని చెప్పారు. 

రేవంత్ రెడ్డి సమాచార హక్కు చట్టం వాడుకుని.. బ్లాక్‌మెయిల్ చేసుకుని డబ్బులు సంపాదించుకున్నాడని ఆరోపించారు. కేసీఆర్ ఎన్నో సార్లు తనను రమ్మని పిలిచారని.. కానీ వెళ్లలేదని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీ అభిమానులు, గతంలో తనతో పనిచేసిన నాయకులు.. కర్ణాటక రిజల్ట్స్ తర్వాత తనను వారి పార్టీలోకి రమ్మని అడుగుతున్న మాట వస్తానని చెప్పారు. అయితే తాను బీజేపీని వీడుతున్నట్టుగా ఊహించుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను బీజేపీని వీడతానని ఎక్కడైనా చెప్పానా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కోసం కష్టపడి పనిచేస్తున్నామని చెప్పారు. 

కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే.. తెలంగాణ గెలవాలని ఏముందని ప్రశ్నించారు. కర్ణాటకలో రాజకీయం వేరు.. తెలంగాణలో రాజకీయం వేరని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ గ్రూప్‌లు ఉన్నాయని.. అధికారం అనేది లేకముందే ఎవరి దారి వారిదేనని విమర్శించారు. కొందరు రేవంత్ సీఎం అంటే.. కొందరు భట్టి సీఎం అంటున్నారని విమర్శించారు. కర్ణాటకలోనైనా ఎన్నికలయ్యే దాకా నాయకులు కలిసి పనిచేశారని చెప్పారు. 

రేవంత్ రెడ్డి 20 ఏళ్లు టీడీపీలో ఉండి కాంగ్రెస్‌లోకి వచ్చారని.. అటువంటి వ్యక్తి ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్న తమపై విమర్శలు చేశారని అన్నారు. అలాంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేయాలా? ఆయనను సీఎం చేయడానికి పనిచేయాలా? అని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్‌లో చేరతానని కథనాలు ఎందుకు వస్తున్నాయనేది అర్థం కావడం లేదన్నారు. తనకు బీజేపీలో ఏ పదవులు అవసరం లేదని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని.. ప్రజలు అదే నమ్మకంతో ఉన్నారని చెప్పారు. టీ బీజేపీలోకి నాయకులు వస్తారని.. చాలా మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్పారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం చేయడానికి ఏం చేయాలనే దానిపై సునీల్ భన్సల్‌తో తాను నిన్న గంట సేపు చర్చించడం జరిగిందని అన్నారు. 

తెలంగాణ బీజేపీలో లాబీయింగ్ ఎవరూ చేయడం లేదని చెప్పారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ మూడేళ్ల టర్మ్ అయిపోయిందని.. ఈ ఏడాది ఎన్నికలు ఉన్న సందర్భంగా ఆయనను కొనసాగిస్తారా? పార్టీ పాలసీ ప్రకారం మార్చాలని అనుకుంటున్నారా? అనేది హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. బండి సంజయ్‌ను మార్చాలని ఎవరూ లాబీయింగ్ చేయడం లేదని చెప్పారు. ఎన్నికల వేళ బీజేపీ బలహీనపరచాలని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.