హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ ఎంపీ, బీజేపీ నేత జి.వివేక్. నమ్మించి మోసం చేయడంలో కేసీఆర్ ను మించిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరంటూ తిట్టిపోశారు. 

బీజేపీ కార్యాయలంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ వివేక్ కొడుకు కోసం తెలంగాణ కోసం, టీఆర్ఎస్ పార్టీకోసం ఎంతో కష్టపడిన హరీశ్ రావును పక్కన పెట్టేశారంటూ నిప్పులు చెరిగారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు హరీష్ రావు గొంతు కోశారంటూ విరుచుకుపడ్డారు. 

ఎన్నికల ప్రచారంలో తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు అప్పుల తెలంగాణగా మార్చేశారంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.62వేల కోట్లు అప్పులు ఉంటే ప్రస్తుతం దాన్ని రూ.లక్ష 82వేల కోట్లకు పెంచేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఎక్కడా అమలు చేయడం లేదని నిధుల లేమి పేరుతో అభివృద్ధిని పక్కన పెట్టేశారంటూ మండిపడ్డారు. మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఏమయ్యాయో చెప్పాలని నిలదీశారు. 

తెలంగాణ ఉద్యమంలో ప్రజల గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి పదేపదే మాట్లాడిన కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణను మరచిపోయి కుటుంబం గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారంటూ మండిపడ్డారు. 

ప్రజాస్వామిక తెలంగాణను పక్కన పెట్టి కేవలం కల్వకుంట్ల తెలంగాణ కోసమే కేసీఆర్ పనిచేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ నిత్యం కొడుకు కేటీఆర్, కూతురు కవితల గురించే మాట్లాడుతున్నాడు, ఆలోచిస్తున్నాడే తప్ప ప్రజల కోసం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.  

నమ్మిన వారిని నట్టేట ముంచే వ్యక్తులలో కేసీఆర్ ప్రథమంగా ఉంటారని మండిపడ్డారు. కేటీఆర్ కోసం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన హరీశ్ రావు గొంతు కోశారని ఆరోపించారు.  

తెలంగాణ ఉద్యమంలో తాను సైతం కీలకంగా పోరాటం చేశానని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఢిల్లీ పెద్దలను ఓప్పించామని గుర్తు చేశారు. దివంగత కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ తో కలిసి తాను అందర్నీ ఒప్పించే ప్రయత్నం చేసినగ్లు తెలిపారు. 

మరోవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులలో కేసీఆర్ భారీగా కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. రూ.30వేల కోట్లతో పూర్తి చేసే కాళేశ్వరం ప్రాజెక్టును రూ.లక్ష కోట్లకు పెంచి దోచుకున్నారంటూ తిట్టిపోశారు. అవినీతిని సహించను అంటున్న కేసీఆర్ మరి ప్రాజెక్టులలో కమీషన్ల పేరుతో దోచుకుంటున్నందుకు ఏం చెయ్యాలో చెప్పాలని నిలదీశారు.

కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తుందని సెటైర్లు వేశారు. సాక్షాత్తు టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే తమ అధినేత తుగ్లక్ అంటూ చెప్పుకొచ్చారంటూ పంచ్ లు వేశారు. కేసీఆర్ కు రాత్రి ఏ ఆలోచన వస్తే తెల్లవారు జామున దాన్ని అమలు చేసేయ్యాలి అనుకుంటారని దాని పర్యవసానాలు ఆలోచించరంటూ మండిపడ్డారు.

కేసీఆర్ కు ఎందులోనూ నిలకడ లేదని విరుచుకు పడ్డారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత టీడీపీలోకి చేరిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినప్పుడు కేసీఆర్ దే కీలక పాత్ర అంటూ విరుచుకుపడ్డారు. 

తన కొడుకు పేరు తారకరామారావు అని పెట్టుకుని మరీ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారంటూ నిప్పులు చెరిగారు. కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. మెున్నటి ఎన్నికల్లో ఒక చెంప చెళ్లుమనిపించారని రాబోయే రోజుల్లో మరో చెంప చెళ్లుమనిపిస్తారంటూ ధ్వజమెత్తారు.  

టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన సందర్భంగా ప్రజలు తనకు అభినందనలు చెప్తున్నారని స్పష్టం చేశారు మాజీ ఎంపీ వివేక్. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసి కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎంపీ వివేక్ కోరారు.