హైదరాబాద్: కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్లతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలనే డిమాండ్ తో ప్రగతి భవన్ ముందు ధర్నాకు ప్రయత్నించిన బీజేపీ కార్పోరేటర్లను పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తైన నెల రోజులు కావొస్తున్నా కూడ ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో బీజేపీ ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఇదే విషయమై ఇటీవల బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు గవర్నర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

మంగళవారం నాడు ఉదయం బీజేపీ కార్పోరేటర్లు  ప్రగతి భవన్ ముందు హరిత హోటల్ లో సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.ఇందులో భాగంగానే ఎన్నికైన కార్పోరేటర్లతో గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేయాలని కోరింది.

హరిత హోటల్ నుండి బీజేపీ కార్పోరేటర్లు  విడతల వారీగా ప్రగతి భవన్ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.

ధర్నాకు దిగిన బీజేపీ కార్పోరేటర్లను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.