హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ అవలంభిస్తున్న విధానాలను నిరసిస్తూ ప్రజల పక్షా న పోరాటం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు చేతులు కలిపాయి.  తెలంగాణ సీఎం కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ భవనాల నిర్మాణాలను ఈ రెండు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఈ ఏడాది జూన్ 27వ తేదీన కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ భవనాల నిర్మాణానికి  తెలంగాణ సీఎం కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు. అయితే కొత్త తెలంగాణ సచివాలయం, కొత్త అసెంబ్లీ భవనాల నిర్మాణాలను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ సాగుతోంది.ఈ నెల 8వ తేదీన పిటిషన్లపై విచారణ సాగనుంది.

మాజీ ఎంపీ జి. వివేక్ ఆదివారం నాడు అఖిలపక్ష సమావేశాన్ని  నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్,బీజేపీ,, లెఫ్ట్, టీడీపీ, టీజేఎస్ బీసీ సంఘాల నేతలు కూడ హాజరయ్యారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, సచివాలయ భవనాలను కూల్చవద్దని  అఖిలపక్షం తీర్మాణం  చేసింది. కొత్త భవనాల నిర్మాణాన్ని ఈ సమావేశం తీవ్రంగా వ్యతిరేకించింది.

ప్రస్తుతం అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలు ఉన్న సమయంలో  కొత్త భవనాల నిర్మాణాలు అవసరం లేదని  ఈ సమావేశంలో ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న భవనాలు మరో 30 నుండి 40 ఏళ్లకు పైగా వినియోగించుకొనే అవకాశం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు.

హెరిటేజ్ భవనాలను కూల్చివేయడం ద్వారా  రాష్ట్ర చరిత్ర మరుగున పడే అవకాశం ఉందని సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సమావేశం అభిప్రాయపడింది. మరో వైపు సుప్రీంకోర్టు కూడ ఈ విషయాన్ని సుమోటోగా తీసుకోవాలని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.