తెలంగాణలో ఎన్నికలకు మరో వారం రోజులే గడువు ఉంది. దీంతో.. టికెట్ దక్కిన అభ్యర్థులంతా తమ నియోజకవర్గంలో పర్యటిస్తూ.. విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు.  కాగా.. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి బాణోత్ మదన్ లాల్ కి మాత్రం చేదు అనుభవం ఎదురైంది. 

నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనను గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రచారంలో భాగంగా శుక్రవారం మదన్ లాల్ కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనగర్ తండాకి వెళ్లారు. కాగా.. ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. లంబాడీలను కించపరిచేవిధంగా మాట్లాడి.. ఇప్పుడు  ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వచ్చారంటూ మండిపడ్డారు.

తమ ప్రాంతంలో పర్యటించడాన్ని అంగీకరించమంటూ ఆందోళన చేపట్టారు. ప్రచార వాహనానికి అడ్డుగా కూర్చొని నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని  పరిస్థితిని చక్కబెట్టారు. అనంతరం మదన్ లాల్ తన ప్రచారాన్ని కొనసాగించారు.