Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌కి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ: రైతుల బకాయిలు చెల్లించాలని డిమాండ్


తెలంగాణ సీఎం కేసీఆర్ కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  సోమవారం నాడు లేఖ రాశారు. రైతులకు చెల్లించాల్సిన  బకాయిలు రూ. 600 కోట్లను చెల్లించాలని కోరారు. 

Bhuvanagiri MP Komatireddy Venkat Reddy writes letter to CM KCR lns
Author
Hyderabad, First Published Jul 19, 2021, 7:33 PM IST


హైదరాబాద్: రైతుల‌పై క‌ప‌ట ప్రేమ చూప‌డం మానుకోవాల‌ని సీఎం కేసీఆర్‌కు భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హిత‌వు ప‌లికారు. ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన వ‌రి ధాన్యం బ‌కాయిలు ఇంకా రూ. 600 కోట్లు చెల్లించాల‌ని బ‌హిరంగ లేఖ రాశారు. రైతుల‌కు  రూ. 600 కోట్ల వరి ధాన్యం కొనుగోలు బ‌కాయిలు ఎందుకు చెల్లించ‌డం లేద‌ని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. రైతుప్ర‌భుత్వం అని చెప్పుకునే టీఆర్ఎస్ స‌ర్కార్ రైతుల ప‌ట్ల చిన్న‌చూపు చూస్తుంద‌ని ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  రైతు ఎడ్చినా రాజ్యం ఎప్ప‌టికీ బాగుప‌డ‌దని ఆయన ఆ లేఖలో గుర్తు చేశారు. ఇక‌నైనా రైతులు క‌న్నీరు పెట్టుకునే చర్య‌ల‌ను మానుకోవాల‌ని సూచించారు.  

వానాకాలం పంట ప‌నులు ప్రారంభ‌మై రైతులు నాట్లు వేసుకుంటున్న ఇంకా వరి ధాన్యం కొనుగోలు బ‌కాయి బిల్లులు చెల్లించ‌డం లేదన్నారు. దీని వ‌ల్ల  దాదాపు ల‌క్ష మంది వ‌ర‌కు రైతున్న‌లు డ‌బ్బులు రాక ఏమి చేయాలో పాలు పోని ప‌రిస్థితి నెల‌కొందని దుయ్య‌బ‌ట్టారు. ఇకనైనా క‌ళ్లు తెరిచి రైతుల‌కు రావాల్సిన డ‌బ్బులను మంజూరు చేయాల‌న్నారు. 

కేసీఆర్ క‌మీషన్లు వ‌చ్చే ప్రాజెక్టుల‌కు ఆగ‌మేఘాల మీద నిధులు విడుద‌ల చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతుల విష‌యంలో ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు. అస‌లు మీకు రైతులంటే ఎందుకు అంతా  చిన్న‌చూపు అని ఆయన అడిగారు. దేశానికి ప‌ట్టెడ‌న్నం పెడుతున్నందుకా..?   లేదా మీరుఏం చేసిన రైత‌న్న ఎదురు తిర‌గ‌డు కాబ‌ట్టా...?  అని ప్ర‌శ్నించారు. వెంట‌నే  రైతులకు బ‌కాయిప‌డ్డ రూ. 600 కోట్లు విడుద‌ల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే  రైతులతో ప్రగతి భవన్ ను కాంగ్రెస్ పార్టీ తరపున ముట్టడి చేస్తామని ఆయన హెచ్చరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios