కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని గతకొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి టీఆర్ఎస్ అధిష్టానంతో టచ్ లో ఉన్నారని...ఏ క్షణాన్నయినా ఆయన పార్టీ మార్పు ప్రకటన చేయనున్నట్లు రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా గండ్ర స్పందించారు. 

టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు, ఆ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు బయట తనపై జరుగుతున్న ప్రచారాన్ని గండ్ర ఖండించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు. తాను పార్టీ మారనున్నట్లు జరుగుతున్నదంతా అసత్య ప్రచారమేనని గండ్ర వెల్లడించారు.

 తనకు అవకాశం కల్పిస్తే కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడిగా సమర్థవంతంగా పనిచేస్తానని...తన రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అవకాశం కల్పించాలని గండ్ర కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు.  తనకు రెండు సార్లు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా పని చేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని గండ్ర గుర్తు చేశారు. 

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.  ఎన్నికల తర్వాత అసలు ప్రతిపక్షాల మనుగడే లేకుండా చేయాలన్న దిశగా సీఎం కేసీఆర్ రాజకీయాలు సాగుతున్నాయి. ఇప్పటికే శాసన మండలిలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాకు గండికొట్టిన కేసీఆర్, శాసన సభలోనూ అదే వ్యూహాన్ని అనుసరించడాని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం కాంగ్రెస్, టిడిపి పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నారు. అందుకోసమే మంత్రి వర్గ విస్తరణ ఆలస్యం అవుతోందని ప్రచారం కూడా జరుగుతోంది.