హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిలు తెలంగాణ హైకోర్టులో మంగళవారం నాడు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.

వీరిద్దరూ కూడ గతంలో సికింద్రాబాద్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సికింద్రాబాద్ కోర్టు కొట్టేసింది. దీంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు.

ఈ ఏడాది జనవరి 22వ తేదీన భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను సికింద్రాబాద్ కోర్టు కొట్టేసింది. ఈ ఏడాది జనవరి 30వ తేదీన భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.

బోయిన్ పల్లికి చెందిన ప్రవీణ్ రావుతో పాటు ఆయన సోదరులను కిడ్నాప్ చేసిన రోజు నుండి జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవ్ రామ్ లు పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నారు.

ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవ్ రామ్ బెయిల్ పిటిషన్లపై  ఇవాళ మధ్యాహ్నం హైకోర్టులో విచారణ నిర్వహించనున్నారు.