Ganesh Chaturthi 2023: వినాయక చవితి, నిమజ్జనం తేదీలపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ క్లారిటీ..
ఈ ఏడాది వినాయక చవితి ఏ తేదీన జరుపుకోవాలనే దానిపై సందిగ్ధం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వినాయక చవితి పండగ, నిమజ్జనంపై భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ క్లారిటీ ఇచ్చింది.
ఈ ఏడాది వినాయక చవితి ఏ తేదీన జరుపుకోవాలనే దానిపై సందిగ్ధం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది తిథి రెండు రోజులు ఉండటంతో గణేశ్ చతుర్థిని సెప్టెంబర్ 18న జరుపుకోవాలా? 19వ తేదీన నిర్వహించాలా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా వినాయక చవితి పండగ, నిమజ్జనంపై భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ క్లారిటీ ఇచ్చింది. గతంలో సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థి నిర్వహించాలని భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు నిర్ణయించారు. అయితే తాజాగా అందులో మార్పులు చేశారు.
తాజాగా సమావేశమైన భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ.. సెప్టెంబర్ 18వ తేదీనే వినాయక చవితి జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది. గణేష్ నిమజ్జనంను సెప్టెంబర్ 28వ తేదీన నిర్వహించాలని ప్రకటించింది కమిటీ. ఆ రోజునే హైదరాబాద్ లో శోభాయాత్ర ఉంటుందని తెలిపింది. శృంగేరి కంచి పీఠాధిపతుల పంచాంగం కూడా 18వ తేదీనే వినాయక చవితి జరుపుకోవాలని సూచించిందని.. అదే విధంగా పలువురు పండితుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అధికారికంగా ప్రకటించటం జరుగుతుందని భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. ఇక, తెలంగాణ ప్రభుత్వం కూడా 18వ తేదీనే వినాయక చవితి సెలవు, 28వ తేదీన నిమజ్జనం సెలవు ప్రకటించాలని సూచించింది.