హైదరాబాద్: హైద్రాబాద్ కింగ్ కోఠి ఆసుపత్రిలో ముగ్గురు మరణించారనే ఘటనపై  హెచ్ఆర్‌సీలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగేంధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఆదివారం నాడు రాత్రి కింగ్ కోఠి ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు మరణించారనే ప్రచారం సాగుతోంది. అయితే  ఈ ప్రచారంలో వాస్తవం లేదని డీఎంఈ రమేష్ రెడ్డి సోమవారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే. 

కింగ్ కోఠి ఆసుపత్రిలో చోటు చేసుకొన్న ఘటనకు  ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, ఆసుపత్రి సూపరింటెండ్, నోడల్ అధికారిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖకు మంత్రి లేకపోవడం కారణంగానే ఈ పరిస్థితి చోటు చేసుకొందని  హెచ్ఆర్‌సీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని  ఆయన డిమాండ్ చేశారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్‌లో కోరారు.