Asianet News TeluguAsianet News Telugu

తొమ్మిది రోజులు బతుకమ్మ వేడుకలు.. ఒక్కోరోజు ఒక్కో పేరుతో..

తెలంగాణ అస్తిత్వానికి నిలుటద్దం బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. తొమ్మిది రోజులలో బతుకమ్మను ఒక్కో రోజు ఒక్కో పేరుతో పిలుస్తారు. 

bathukamma celebrated nine days nine different names
Author
First Published Sep 21, 2022, 1:27 PM IST

తెలంగాణ అస్తిత్వానికి నిలుటద్దం బతుకమ్మ. తంగేడు, గునుగు పూలతో పేర్చి తొమ్మిది రోజులు అన్ని వర్గాల మహిళలు సంబురంగా చేసుకునే ఈ పండుగ తెలంగాణకు ఒక విశిష్టత. ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలు.. సెప్టెంబర్ 25వ తేదీన ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3వ తేదీన సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ప్రతి రోజు వివిధ రకాల పదార్థాలతో రుచికరంగా నైవేద్యం తయారు చేస్తారు. తొమ్మిది రోజులలో బతుకమ్మను ఒక్కో రోజు ఒక్కో పేరుతో పిలుస్తారు. మరి ఆ పేర్లు ఏమిటో తెలుసుకుందామా.. 

1. ఎంగిలి పువ్వుల బతుకమ్మ - బతుకమ్మ పండుగ భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది. దీన్ని తెలంగాణలో పెత్ర అమావాస్య అని కూడా పిలుస్తారు. బతుకమ్మ పండగ మొదటి రోజును ఎంగిలి పువ్వు బతుకమ్మ అని పిలుస్తారు. బతుకమ్మను పేర్చడానికి సేకరించిన పూలను సమానంగా ఉండేలా పేర్చుతారు. పూర్వకాలంలో కాడలు నోటితో సమానంగా చించి బతుకమ్మను పేర్చేవారు. అలా చేసినప్పుడు పూలు ఎంగిలౌతాయి. అప్పటి నుంచి పెత్రామాస సందర్భంగా ఆడే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తుంటారని చెబుతుంటారు. 

2. అటుకుల బతుకమ్మ- ఆశ్వయుజ మాసంలో తొలి రోజైన పాడ్యమి నాడు జరుపుకునే బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.

3. ముద్దపప్పు బతుకమ్మ- బతుకమ్మ ఆటలో మూడో రోజైన విదియ నాడు ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజున ముద్దపప్పు, బెల్లం, పాలు.. మొదలైన పదార్థాలతో నైవేద్యం సమర్పిస్తారు.

4. నానబియ్యం బతుకమ్మ- వేడుకల్లో నాలుగో రోజు బతుకమ్మను నానబియ్యం బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజున నానేసిన బియ్యం, పాలు, బెల్లంతో కూడిన నైవేద్యం సమర్పిస్తారు. 

5. అట్ల బతుకమ్మ- వేడుకల్లో ఐదో రోజు బతుకమ్మను అట్ల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజున పెసర్లు, బియ్యంతో చేసిన అట్లు నివేదిస్తారు. 

6. అలిగిన బతుకమ్మ- వేడుకల్లో ఆరో రోజున బతుకమ్మను అలిగిన బతుకమ్మ అని పిలుస్తారు. చాలాచోట్ల దీన్ని అర్రెం అని కూడా పేర్కొంటారు. ఈ రోజున బతుకమ్మ ఆడరు. అలాగే ఎలాంటి నైవేద్యం కూడా తయారు చేయరు.

7. వేపకాయల బతుకమ్మ- వేడుకల్లో ఏడో రోజున బతుకమ్మను వేపకాయల బతుకమ్మ అని పిలుస్తుంటారు. వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు. లేదా పప్పు, బెల్లం నైవేద్యంగా పెడతారు.

8. వెన్నముద్దల బతుకమ్మ-  వేడుకల్లో ఎనిమిదో రోజున బతుకమ్మను వెన్నముద్దల బతుకమ్మ అని పిలుస్తారు. ప్రసాదంగా వెన్న, నెయ్యి, నువ్వులు, బెల్లం నైవేద్యంగా పెడతారు. 

9. సద్దుల బతుకమ్మ-  తొమ్మిదవ రోజు చివరగా అత్యంత ముఖ్యమైన సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలో ఎనిమిదో రోజైన దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజున పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ రెండింటిని పేర్చుతారు. ఎంతో వైభవంగా సద్దుల బతుకమ్మన నిర్వహిస్తారు. ఈరోజు  పెరుగన్నం, చిత్రాన్నం, పులిహోర, కొబ్బరిపొడి, నువ్వులపొడిలను గౌరమ్మను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆట పూర్తయిన అనంతరం బతుకమ్మను నిమజ్జనం చేసి సద్దులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios