విద్యాబుద్ధులు చెప్పాల్సిన అధ్యాపకుడే... విద్యార్ధినుల పట్ల కీచకుడిగా మారాడు. అతని రాసలీలలు వెలుగులోకి రావడంతో కీచక అధ్యాపకుడిని విధుల్లోంచి తొలగించారు.  వివరాల్లోకి వెళితే... నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో కెమిస్ట్రీ హెచ్‌ఓడీగా పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ రవి రాసలీలలు అన్నీ ఇన్నీ కావు.

గ్రామీణ ప్రాంత విద్యార్ధినిలను పరీక్షల్లో పాస్ చేయిస్తానంటూ లొంగదీసుకునేవాడు. 4 నెలల క్రితం రాత్రివేళలో అతడు విద్యార్ధినులతో ఏకాంతంగా ఉండటంతో సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు.

అలాగే 20 రోజుల క్రితం రవి ఓ అమ్మాయిని కారులో తీసుకెళ్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. ఆ సమయంలో ఇది పర్సనల్.. మీకెందుకు అని చెప్పడం వీడియోల్లో హల్‌చల్ చేసింది.

విద్యార్ధినులు తన దారికి వచ్చారు అని భావించిన వెంటనే రవి వారి నెలసరి వివరాలను అడిగేవాడు. సాధారణంగా నెలసరి తర్వాత 13, 14, 15 రోజుల్లో గర్భం దాల్చే అవకాశం వుంటుంది.

దీని ఆధారంగా సదరు కామాంధుడు.. అమ్మాయిలతో గడిపేవాడు. ఒక విద్యార్ధినికి ఇలాగే మెసేజ్‌లు పెట్టడం.. అది ఓ హాస్టల్ వార్డెన్ పసిగట్టడంతో రవి వ్యవహారం బయటకు వచ్చింది.

దీంతో సదరు విద్యార్ధినితో పాటు మరో ఇద్దరు బాధిత విద్యార్ధినులు అధికారుల ఎదుట కీచకుడు రవి అరాచకాల గురించి వాపోయారు. కాగా.. కొద్దిరోజుల క్రితమే రవి వ్యవహారంపై విద్యార్ధినులు వర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి.. వారు పట్టించుకోలేదన్న విమర్శలు వున్నాయి.

అయితే శనివారం నాటి ఘటన వైరలవ్వడంతో అధికారులు స్పందించారు. మరోవైపు ఈ కేసును నీరుగార్చేందుకు వర్సిటీలోని కొందరు పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వారి ఆదేశాలతోనే పరిపాలనా విభాగం అధికారులు పేలవమైన అంశాలను నివేదికలో పేర్కొంటున్నట్లుగా తెలుస్తోంది.

అయితే విద్యార్ధినులపై లైంగిక వేధింపుల విషయం వైరల్ కావడంతో విద్యార్ధి సంఘాలు వర్సిటీ ఎదుట నిరసనకు దిగాయి. విద్యార్ధినులను వేధించిన రవిపై కఠినచర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

దీంతో బాసర పోలీసులు రవిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యూనివర్సిటీ సైతం విచారణ కమిటీని నియమించి.. కమిటీ నివేదిక మేరకు వీసీ.. రవిని విధుల్లోంచి తప్పించారు.