తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారని తెలియగానే ఆందోళన చెందానని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్థతతో యశోద ఆస్పత్రికి వెళ్లారనే వార్త టీఆర్‌ఎస్ శ్రేణుల్లోనే మాత్రమే కాకుండా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. కేసీఆర్ రెండు రోజులుగా వీక్‌గా ఉండటం, ఎడమ చేయి నొప్పిగా ఉండటంతో పరీక్షల నిమిత్తం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. దీంతో వైద్యులు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి పలువురు వాకబు చేశారు.

ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టుగా ట్వీట్ చేశారు. ‘కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారని తెలియగానే ఆందోళన చెందాను. ఆయన త్వరగా కోలుకోవాలని, సుదీర్ఘమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆశీర్వదించాలని నేను మా దుర్గాని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను’ అని బండి సంజయ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Scroll to load tweet…

ఇక, యశోద ఆసుపత్రిలో యాంజియోగ్రామ్ తో పాటు CT Scan స్కాన్ వంటి పరీక్షలు నిర్వహించారు. యాంజియోగ్రామ్ పరీక్షల్లో ఎలాంటి బ్లాక్స్ లేవని తేలిందని వైద్యులు తేల్చి చెప్పారు. రెండు రోజులుగా నీరసంగా ఉన్నట్టుగా సీఎం వైద్యులకు తెలిపారు. మరో వైపు ఎడమ చేయి లాగుతున్నట్టుగా కేసీఆర్ వైద్యులకు చెప్పారు. దీంతో సీఎం కేసీఆర్ కు గుండెకు సంబంధించిన పరీక్షలు నిర్వహించాలని వైద్యులు నిర్ణయం తీసుకొన్నారు. ఇందులో భాగంగానే యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. ఇతర అవసరమైన పరీక్షలు నిర్వహించనున్నారు. మరో వైపు సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు.

ముందు జాగ్రత్తతో చేస్తున్న పరీక్షలు మాత్రమే..
‘సీఎం కేసీఆర్‌కు ప్రతి ఏటా ఫిబ్రవరిలో పరీక్షలు చేస్తుంటాం. రెండు రోజులుగా బలహీనంగా ఉన్నట్లు కేసీఆర్ చెప్పారు. సాధారణ పరీక్షలు చేశాం. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. దీంతో ముందు జాగ్రత్తగా మరికొన్ని పరీక్షలు చేస్తున్నాం. సీఎం గారికి సీటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నాం. రొటీన్ పరీక్షల్లో భాగంగానే చేస్తున్నాం. ఈ పరీక్షల ఫలితాలను బట్టి ఏంచేయాలో చూస్తాం. వారు నిలకడగా ఉన్నారు. ఇది కేవలం ముందుజాగ్రత్తతో చేస్తున్న పరీక్షలు మాత్రమే’ అని సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు తెలిపారు. ఈ మేరకు సీఎంవో ట్విట్టర్‌లో ప్రకటన చేసింది.