గోషా మహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గోవుల అక్రమ రవాణాకకు సంబంధించిన అంశం దీనికి కారణమైంది.

ఈ వ్యవహారంలో శంషాబాద్ వెళ్లిన రాజాసింగ్ పోలీసులపై ఆరోపణలు చేస్తూ తన వాహనం నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. దీనిపై సజ్జనార్ కౌంటరిచ్చారు.

ఎవరు పడితే వారు మీడియాలో పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసులపై నిందలు వేయడం ఫ్యాషనైపోయిందని చెప్పారు.

ఆవుల అక్రమ తరలింపులో ఎవరైనా డబ్బులు తీసుకున్నారంటే సాక్ష్యాలు చూపాలని సజ్జనార్ డిమాండ్ చేశారు. ఫిర్యాదులు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అయినప్పటికీ చర్యలు తీసుకోకుంటే.. అప్పుడు మాట్లాడండి అని కౌంటరిచ్చారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కేసు నమోదు చేస్తామని సజ్జనార్ హెచ్చరించారు.

మరోవైపు రాజాసింగ్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మద్ధతు పలికారు. కొందరు పోలీసులు ఆవుల తరలింపుకు సహకరిస్తున్నారని సంజయ్ ఆరోపించారు.

తాము పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకం కాదని... కొందరు పోలీస్ అధికారులకు మాత్రమే వ్యతిరేకమని బండి సంజయ్ తేల్చి చెప్పారు. అవార్డులు, రివార్డుల కోసం టీఆర్ఎస్‌కు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఎన్నికల సమయంలో బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారని.. కానీ ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త మీద కేసు పెట్టారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. తాము పోలీసు కేసులకు భయపడేవాళ్లమని.. పోలీస్ స్టేషన్ ముందే గోవుల అక్రమ రవాణా జరుగుతున్నా ఎందుకు అడ్డుకోవడం లేదని సంజయ్ ఎద్దేవా చేశారు.