హుజూర్ నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఆ నియోజకవర్గాన్ని దక్కించుకునేందుకు అన్ని ప్రధాన పార్టీల నేతలు ఆసక్తిగా ఉన్నాయి. ప్రధాన పార్టీ నేతలతోపాటు.. సాధారణ ప్రజలు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. అంతెందుకు ఓ 85ఏళ్ల బామ్మ కూడా నామినేషన్ వేశారు. దీంతో ఈ ఎన్నిక చాలా ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో టీడీపీ కూడా పోటీ పడుతుండటం విశేషం. తెలంగాణలో టీడీపీ పూర్తిగా ఉనిఖి కోల్పోయిందని తెలిసినప్పటికీ... టీడీపీ ఎన్నికకు దిగడం గమనార్హం.

కేవలం పోటీకి దిగడంతో టీడీపీ ఆగడం లేదు. గట్టిగానే పోటీ ఇవ్వాలని నిశ్చయించుకుంది. అందుకే ప్రచారం కూడా గట్టిగానే చేయాలని భావిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ప్రచారం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా... హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ప్రచారానికి సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన చావా కిరణ్మయికి మద్దతుగా బాలకృష్ణ ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈనెల13నుంచి 18లోపు షెడ్యూల్‌ ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికపై శనివారం హైదరాబాద్‌లో చంద్రబాబునాయుడు ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ పర్యటనకు సంబంధించి కీలకచర్చలు జరిపినట్లు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నామమాత్రంగా పోటీచేసిన టీడీపీ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
 
టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవిందకుమార్‌గౌడ్‌, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డిలు చంద్రబాబుకు ఉపఎన్నికపై వివరించినట్లు తెలిసింది. హుజూర్‌నగర్‌లో ఈనెల21న జరగనున్న ఉపఎన్నికపై అన్ని పార్టీలు ప్రధాన దృష్టిసారించాయి. అందుకనుగుణంగా రోడ్‌షోలు, బహిరంగ సభలు ఏర్పాటుచేస్తున్నారు. ఆయా పార్టీల రాష్ట్ర నేతలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల రాకతో హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది.