ఒక్క ఆటోలో ఎంతమంది పడతారు 10 మంది ఆటోవాలా మరీ కక్కుర్తిపడితే 15 మంది. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 24 మందిని కుక్కాడు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఆటోడ్రైవర్ తన వాహనంలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని తిమ్మాపూర్‌ వెళ్తూ పోలీసులకు చిక్కాడు.

వారిని కిందకు దింపి లెక్కించగా.. మహిళలు, పిల్లలు కలిపి మొత్తం 24 మంది ఒకే ఆటోలో నుంచి దిగడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలాంటి వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఇది చూసిన నెటిజన్లు.. ఈ ఘటనను తెలుగు సూపర్‌ హిట్ మూవీ అతడును గుర్తు చేసుకుంటున్నారు. సదరు సినిమాలో తనికెళ్ల భరణి, కొడుకు బ్రహ్మాజీ కలిసి.. హీరో మహేశ్‌ను మర్డర్ చేయాలని భావిస్తారు.

అందుకు గాను బ్రహ్మాజీ క్వాలీస్‌లు కావాలని చెప్తాడు. మధ్యలో భరణి కలగజేసుకుని.. మర్డర్‌ చేయాలంటే కత్తులుండాలి కానీ, క్వాలీసులు, సుమోలు ఎందుకురా భుజ్జీ.. అన్ని బండ్లు వద్దురా పెట్రోల్‌ రేట్లు పెరిగాయి కదా.. అందరూ కలిసి ఒకే బండిలో వెళ్లండిరా’’ అని చెబుతాడు.

అతను చెప్పినట్లే రౌడీలందరూ కలిసి ఒకే సుమోలో కూర్చొని వస్తారు. ఆ సన్నివేశం ప్రేక్షకులను ఇప్పటికే కడుపుబ్బా నవ్విస్తుంది.