తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు తెరలేపిన సంగతి తెలిసిందే. దీంతో... చాలా వరకు బస్సులన్నీ బస్టాండ్ లకే పరిమితమయ్యాయి. అయితే... అక్కడక్కడా ప్రైవేటు వ్యక్తులతో బస్సులను నడుపుతున్నారు. కాగా...వాటిపై కూడా ఆర్టీసీ కార్మికులు దాడులకు పాల్పడుతున్నారు.

శనివారం ఉదయం పరిగి నుంచి వికారాబాద్ వెళ్తున్న బస్సుపై కొందరు వ్యక్తులు రాళ్ల తో దాడులు చేశారు. బస్సు అద్దాలపై రాళ్లు విసిరారు. దీంతో అద్దాలు పగిలిపోయాయి. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా... ఈ రాళ్ల దాడి ఆర్టీసీ కార్మికులే చేసి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.బస్సుతో పాటు ఎస్కార్ట్ వాహనం ఉన్నప్పటికీ రాళ్లదాడి చేయడం గమనార్హం.

ఇదిలా ఉండగా... శుక్రవారం సాయంత్రం త్రిసభ్య కమిటీతో మరోసారి జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమవుతుందని జేఏసీ ప్రకటించింది. రాష్ట్రంలో సకల జనుల సమ్మెను మించిన సమ్మె ప్రస్తుతం అవసరమని.. అద్దె బస్సు  డ్రైవర్లు దీనికి సహకరించాలని కార్మిక సంఘాలు కోరాయి.

ఆర్టీసీలోని 50 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటారని.. ఎవరైనా డ్రైవర్లు బస్సులు నడిపితే వేలాది మంది కార్మికులకు ద్రోహం చేసినట్లేనని అశ్వత్థామరెడ్డి తెలిపారు.మరోవైపు సర్వీసులు పెంచాలని ఓలా, ఉబెర్‌, మెట్రో సంస్థలను కోరారు... సర్వీసులను పెంచడంతోపాటు ఎక్కువ ఛార్జ్‌ చేయొద్దని మెట్రో అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దీంతో స్పందించిన మెట్రో అధికారులు మెట్రో సర్వీసుల సమయాన్ని పెంచారు. తెల్లవారుజాము నుంచి అర్థరాత్రి వరకు మెట్రో సర్వీసులు నడుస్తుందని హైదరాబాద్ మెట్రో రైల్ ప్రకటించింది.ఆర్టీసీలో అందుబాటులో ఉన్న 2100 అద్దెబస్సులు నడపాలని భావిస్తున్నట్లు త్రిసభ్య కమిటీ సభ్యుడు సునీల్‌ శర్మ తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లను భర్తీ చేసి నడుపుతాం.

3 వేల మంది డ్రైవర్లను తీసుకుంటాం. స్కూల్‌ బస్సులు 20వేలు ఉన్నాయి. ప్రైవేటు, స్కూల్‌, అద్దె బస్సులను నడుపుతాం. అవసరమైతే పోలీసుల సహకారం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.డ్రైవర్లకు రూ. 1,500, కండక్టర్లకు 1,000, రిడైర్డ్ సూపర్ వైజర్లకు 1,500, రిడైర్డ్ మెకానిక్‌లకు 1,000, రిడైర్డ్ క్లర్క్‌లకు 1,000 చొప్పున రోజూ వేతనంగా చెల్లించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.