సిరిసిల్లాలో ఏటీఎం చోరీకియత్నం.. నిమిషాల్లో దొంగను పట్టుకున్న పోలీసులు.. (వీడియో)
ఏటీఎంలో చోరీకి యత్నించాడో దొంగ.. కానీ ఈ విషయం బ్యాంక్ అధికారులకు తెలియడంతో క్షణాల్లో పోలీసులకు సమాచారం అందించారు. అంతే నిమిషాల్లో దొంగ దొరికిపోయాడు.
సిరిసిల్ల : Sirisilla పట్టణంలోని గాంధీచౌక్ వద్ద గల State Bank of India Bank బ్యాంక్ వద్ద గల ATMలో చోరీకి యత్నించి పారిపోయిన దొంగను అప్పటికప్పుడే పట్టుకొని స్టేషన్ కు తరలించారు నైట్ పెట్రోలింగ్ పోలీసులు. ఏటిఎంలో ఓ వ్యక్తి చోరీకి యత్నిస్తున్నసంగతి బ్యాంక్ అధికారులకు తెలియడంతో వారు డయల్ 100కు కాల్ చేయడంతో నైట్ పెట్రోలింగ్ లో ఉన్న ఏఎస్సై జమాలొద్దీన్ సంఘటనా స్థలానికి చేరుకోగా దొంగ అప్పటికే అక్కడినుండి ఫరారయ్యాడు.
"
ఏటిఎం డోర్ ఓపెన్ చేసి ఉండగా సి.సి.ఫుటేజ్ ఆధారంగా వీడియోలో ఉన్న దొంగను పెట్రోలింగ్ సిబ్బంది ఆ ప్రాతమంతా గాలించి నిమిషాల్లోనే అతనిని పట్టుకున్నారు. దొంగ వద్ద దొరికిన బ్యాగ్, పర్సు ఆధారంగా దొంగ ఇతర రాష్ట్రానికి చెందిన వాడిగా గుర్తించారు. అనంతరం అతడిని సిరిసిల్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 7న ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో ఓ విచిత్ర దొంగతనం బయటపడింది. జులాయి సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ గుర్తుందా? ఎక్కడ దొంగతనం చేసినా క్షణాల్లో దొరికిపోతాడు.. అలాంటి దొంగే ఇతను కూడా.. ఆంధ్రప్రదేశ్‌లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ దొంగ ఆలయంలోని అమ్మవారి మీదున్న బంగారం, వెండి కోసం కక్కుర్తి పడ్డాడు. ఎలాగైనా దొంగతనం చేయాలనుకున్నాడు. రాత్రివేళ జనసంచారం లేని సమయం చూసుకుని.. గుడి గోడకు కన్నంవేసి ఎంచక్కా గుళ్లోకి దిగాడు. అనుకున్నట్టుగానే బంగారం, వెండి తీసుకున్నాడు. కానీ..అమ్మవారే ఆగ్రహించిందో.. అతని జాతకమే దెబ్బకొట్టిందో కానీ.. వెళ్లేప్పుడు ఎంచక్కా కన్నంలోంచి దూకిన అతను వచ్చేప్పుడు మాత్రం అంత ఈజీగా రాలేకపోయాడు. ఇంకేముంది కన్నంలో ఇరుక్కుపోయాడు. తెల్లారి ఇది గమనించిన స్థానికులు.. ఏంటా అని దగ్గరికి వచ్చి చూసి షాక్ అయ్యారు. సదరు గుడి యాజమాన్యానికి విషయం తెలిపారు. వీడియోలు తీశారు.
ఈ క్రమంలో ఆ కన్నంలో ఇరుక్కున్న దొంగ... ‘అన్నా బైటికి లాగండన్నా..’ అంటూ వేడుకోవడం.. కనిపిస్తుంది. తొమ్మదిగ్రాముల వెండి, అమ్మవారి ముక్కుపుడకలాంటి చిన్న చిన్న వస్తువులకోసం ఆశపడి.. ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు చెబుతున్న వివరాల్లోకి వెడితే.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా జామి ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం చేసిన ఓ దొంగ పారిపోతుండగా.. గోడ కున్న కన్నంలో ఇరుక్కుపోయాడని పోలీసు అధికారి బుధవారం తెలిపారు. నిందితుడిపై శ్రీకాకుళం జిల్లా కంచిలి పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ కేసు నమోదైంది.
‘‘శ్రీకాకుళం జిల్లా జామి ఎల్లమ్మ ఆలయంలో పాపారావు అనే దొంగ తొమ్మిది గ్రాముల వెండి దొంగిలించాడు. ఆలయ ప్రాంగణంలోని గోడకు రంధ్రం చేసి ఆలయంలోకి ప్రవేశించి.. తిరిగి వెళ్తుండగా కన్నంలో ఇరుక్కుపోయాడు దొంగ. దీంతో దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నట్లు కంచిలి పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ చిరంజీవి తెలిపారు.
అమ్మవారి ముక్కుపుడక, ఇతర వెండి ఆభరణాలను గుంతలోంచి బయటకు పారేసిన తరువాత.. తానూ బైటికి వచ్చే క్రమంలో రంధ్రంలో ఇరుక్కుపోయిన దొంగ కనిపించాడని ఆలయ యజమాని ఎల్లమ్మ తెలిపారు. "ఇలాంటి సంఘటనలు ఇంతకుముందెన్నడూ జరగలేదు. దొంగ గోడకు కన్నం చేసి లోపలికి వచ్చాడు. కానీ పని ముగించుకున్న తరువాత బయటకు వెళ్ళలేకపోయాడు, అతను అమ్మవారి ముక్కుపుడక, ఇతర వెండి ఆభరణాలను బయటకు విసిరివేయడం కనిపించింది" అని ఆలయ యజమాని చెప్పారు.