హైదరాబాద్:  దీపావళి పర్వదినం సందర్భంగా టపాసులు పేలుళ్ల సందర్భంగా వెలువడిన నిప్పు రవ్వలు కళ్లలో  పడడంతో   సుమారు 50 మందికి  గాయాలయ్యాయి. చికిత్స కోసం బాధితులు సరోజిని కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు.

దీపావళిని పురస్కరించుకొని టపాకాయలు పేల్చే సందర్భంలో వెలువడిన నిప్పురవ్వలు  కళ్లలో పడి  గాయపడిన బాధితులు సరోజిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.   ఈ 50 మందిలో 8 మంది బాధితుల కళ్లకు తీవ్ర గాయాలైనట్టుగా వైద్యులు చెబుతున్నారు. వీరికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. మరో 42 మందికి  స్వల్పగాయాలైనట్టుగా వైద్యులు ప్రకటించారు.

అన్ని వయస్సుల వారు కళ్లకు గాయాలతో  ఆసుపత్రిలో చికిత్సకు వచ్చినట్టు వైద్యులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి బాధితులు ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారని వైద్యులు చెప్పారు. పండుగ రోజూ కూడ నలుగురు వైద్యులు  అందుబాటులో ఉన్నారు.