తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అతనేం చేశాడు. అంటే టిఫిన్ తిన్నాడు.. అదేంటీ టిఫిన్ తింటే కూడా విచిత్రమేనా అనుకోకండి.. అతను తిన్నది ఫైవ్ స్టార్ హోటల్ లోనో, మందిమార్బలంతో కలిసి ఏదో రెస్టారెంట్లోనో కాదు. రోడ్డు పక్కనున్న టిపిన్ సెంటర్ దగ్గర. అది కూడా ఎలాంటి ఆర్బాటం లేకుండా సామాన్య కస్టమర్ లా వెళ్లి లైన్లో నిలబడి టిపిన్ కొనుక్కుని అక్కడే ఉన్న ప్లాస్టిక్ స్టూల్ మీద కూర్చుని మరీ తిన్నాడు.

ఆ తరువాత కానీ అక్కడున్న వాళ్లకు అతను ఎమ్మెల్యే అని తెలియలేదు. అప్పుడు వాళ్లు షాక్ అయ్యారు. తమతో  సామాన్యుడిలా కలిసిపోయిన ఆ ఎమ్మెల్యేను మెచ్చుకున్నారు. 

ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరో తెలుసా.. ఆత్రం సక్కు, ఆసిఫాబాద్ శాసన సభ్యుడు. హైదరాబాద్ నుంచి తన నియోజవర్గమైన ఆసిఫాబాద్ కు వెడుతుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఆయన ఇలా చేయడం ఇది మొదటిసారి కాదు.

ఆసిఫాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే క్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు చాలా చోట్ల సాధారణ హోటల్‌లో భోజనం చేసేవారు. తన నియోజకవర్గంలో కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారు వండుకున్న భోజనాన్నే తినేవారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు.

కార్పొరేటరో, కౌన్సిలరో చివరికి వార్డు మెంబరో అయితే కూడా మందీ మార్బలంతో హల్ చల్ చేస్తున్న రోజులువి. అలాంటిది ఓ ఎమ్మెల్యే ఇలా సామాన్యజనంలో కలిసిపోవడం అందరి ప్రశంసలూ అందుకుంటోంది. ఇలా సామాన్యుల్లో తాము ఒకరిలా కలిసిపోయే వారిలో ములుగు సీతక్క ముందుంటారు. మంత్రి హరీశ్ రావు అదే కోవలోకి వస్తాడు. ఇప్పుడు ఆత్రం సక్కు అదే బాటలో నడుస్తున్నారు.