పుల్వామా ఉగ్రదాడి ఖచ్చితంగా పాకిస్థాన్ పనేనని హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసి ఆరోపించారు.. ఆ దేశ  ఆర్మీ, ఐఎస్ఐ సహకారంతోనే జైషే  మహ్మద్ ఉగ్రవాత సంస్థ భారత సైనికులపై దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఇలా భారత సైనికులను పొట్టనబెట్టుకుని ఇప్పుడు తమకేమీ సంబంధం లేదని పాక్ తప్పించేకునే ప్రయత్నం చేస్తోందని ఓవైసి అన్నారు. 

పాకిస్ధాన్ కు చెందిన ఓ మంత్రి భారత దేవాలయాల్లో గంట కొట్టడం ఆపగలరా? అంటూ ప్రశ్నించారని ఓవైసి గుర్తుచేశారు. అయితే కేవలం దేవాలయాల్లోనే కాదు మసీదుల్లో కూడా ఆజాన్‌ సౌండ్స్‌, నమాజ్‌ గంటలు మోగిస్తారని  సదరు మంత్రి గుర్తించాలని...కేవలం భారత్ లో ఈ మతసామరస్యం కనిపిస్తుందని ఓవైసీ అన్నారు. భారతీయుల ఐక్యమత్యాన్ని చూసి పాక్ ఓర్వలేక పోతోందన్నారు. అంతర్గతంగా ఎన్ని గొడవలున్నా...దేశం జోలికి ఎవరైనా వస్తే భారతీయులంతా ఒక్కటేనని ఓవైసి తెలిపారు. 

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కూడా ఓవైసీ ఐర్ అయ్యారు. భారత్ పై దాడి గురించి తమకేమీ తెలియదన్నట్లు ఇమ్రాన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కెమెరాల ముందు కూర్చుని ఇలా అమాయకత్వపు మాటలు చెప్పడాన్ని కట్టిపెట్టాలని సూచించారు. గతంలో పఠాన్ కోట్, ఉరి సైనిక స్థావరాలపై, ప్రస్తుతం పుల్వామాలో సైనికులపై దాడి చేయించింది మీరు కాదా? అని ఇమ్రాన్ ను ఓవైసీ ప్రశ్నించారు.