కూకట్ పల్లి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై ఏఐఎంఐఎం పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూకట్ పల్లి రోడ్ షోలో పాల్గొన్న ఓవైసీ అమిత్ షా పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ముస్లింలకు బిర్యాని పంపిస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. 

అమిత్‌ షా బిర్యానీ ఇష్టపడతారని తనకు తెలియదని, తెలిస్తే అప్పుడే కళ్యాణి బిర్యానీ పంపించమని కేసీఆర్‌కు చెప్పేవాడినన్నారు. ఆయనకు పెట్టకుండా కేసీఆర్‌ తమకు బిర్యానీ పెడుతున్నానరని అమిత్‌ షా కుళ్లుకుంటున్నారని, ఈ సారి ఖచ్చితంగా ఆయనకు కళ్యాణీ బిర్యాని పార్సిల్‌ పంపిస్తామన్నారు.

ఇతరులు బిర్యానీ తింటుంటే ఎందుకంత కడపు మంటా? అని అమిత్‌ షాను నిలదీశారు ఓవైసీ. కావాలనుకుంటే వారు కూడా తినవచ్చని సలహా ఇచ్చారు. పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూతరు పెళ్లికి ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం లేకుండా వెళ్లలేదా? అని, అప్పుడు తెలియదా అతనేం పెట్టారో అని నిలదీశారు. 

ఇక తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య కుదిరిన అవగాహన మేరకే ఒకరికొకరు సహకరించుకుంటున్నామన్నారు. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎంఐఎం నేతలు టీఆర్ఎస్‌కు ఓటు వేయాలంటూ ప్రచారం సాగిస్తున్నారు. కేసీఆర్‌ కూడా ఇప్పటికే ఎంఐఎం తమ మిత్రపక్షమని ప్రకటించారు.