తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో దక్షిణ భారత లెఫ్టినెంట్ మేజర్ జనరల్ అరుణ్, ఇతర ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేతపై చర్చ జరిగింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో (secunderabad cantonment ) రోడ్ల మూసివేత, ఇతర అంశాలపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో (ktr) ఆర్మీకి చెందిన (army officials) ఉన్నతాధికారులు మంగళవారం భేటీ అయ్యారు. మెహిదీపట్నంలోని కంటోన్మెంట్ ఏరియాకు (mehdipatnam cantonment) సంబంధించిన వరద కాలువ వంటి సమస్యలపై విస్తృతంగా చర్చించారు. నానక్ రామ్‌గూడలోని హెచ్‌జీసీయల్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నగరం నలుదిక్కులా భారీ ఎత్తున రోడ్ల నిర్మాణం, విస్తరణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. కంటోన్మెంట్ ఏరియాల్లో కూడా మౌలిక వసతుల కల్పన జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే స్కైవేల నిర్మాణం విషయంలో కేంద్ర రక్షణ శాఖ అనుమతులు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రులను రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పలుమార్లు కలిసి విజ్ఞప్తులు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదన్నారు.
కంటోన్మెంట్ ఏరియాలో పదేపదే రోడ్లను మూసివేయడంతో.. స్థానిక ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేటీఆర్.. ఆర్మీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆర్మీకి సంబంధించిన ప్రతి విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత గౌరవప్రదమైన దృక్పథంతో ముందుకుపోతుందని కేటీఆర్ తెలిపారు. కల్నల్ సంతోష్ బాబుతో పాటు గాల్వన్ లోయ అమరవీరులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడి, దేశానికే ఆదర్శంగా నిలిచామని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆర్మీ జనరల్ మేనేజర్ అరుణ్, ఆయన బృందానికి మంత్రి కేటీఆర్ శాలువాలతో సత్కరించి, మేమెంటోలను అందజేశారు.
మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తామని దక్షిణ భారత లెఫ్టినెంట్ మేజర్ జనరల్ అరుణ్, ఇతర ఉన్నతాధికారులు మంత్రి కేటీఆర్‌కు హామీ ఇచ్చారు. రోడ్ల మూసివేత అంశంపైన ప్రధానంగా చర్చించి, త్వరలోనే ఆర్మీ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఒక ఉమ్మడి ఇన్‌స్పెక్షన్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. దీంతో పాటు మెహిదీపట్నం ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో బల్కాపూర్ వరద నాల విస్తరణ చేసేందుకు సానుకూలంగా స్పందించారు. మెహిదీపట్నం చౌరస్తాలో స్కైవాక్ నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని ఆర్మీ అధికారులు హామీ ఇచ్చారు. గోల్కొండ గోల్ఫ్ కోర్స్, డాలర్ హిల్స్ మీదుగా నెక్నాంపూర్ వైపు లింకు రోడ్ల నిర్మాణానికి సైతం సహకరిస్తామని కేటీఆర్‌కు తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసం చేపట్టే ఏ కార్యక్రమానికైనా ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని మేజర్ జనరల్ అరుణ్ బృందం మంత్రి కేటీఆర్‌కు హామీ ఇచ్చింది.
