Asianet News TeluguAsianet News Telugu

ఇదెక్కడి విడ్డూరం ... జగన్-కేసీఆర్ అయితే ఒప్పు... చంద్రబాబు-రేవంత్ కలిస్తే తప్పా..!!

గతంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్ భేటీ అయ్యారు... అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. కానీ అప్పుడు సీఎంల భేటీపై ఎలాంటి వివాదం సాగలేదు... కానీ ఇప్పటి మీటింగ్ ను వివాదంలోకి లాగే ప్రయత్నం జరుగుతోంది... ఎలాగంటే..

AP CM Chandrababu Naidu and Telangana CM Revanth Reddy Meeting in Hyderabad AKP
Author
First Published Jul 6, 2024, 10:00 AM IST | Last Updated Jul 6, 2024, 10:07 AM IST

Nara Chandrababu ‌- Revanth Reddy Meeting : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(శనివారం) మొదటిసారి భేటీ కానున్నారు. విభజన సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇద్దరు సీఎంలు ముందుకు వస్తున్నారు. అన్నదమ్ముల్లా విడిపోయిన తెలుగు రాష్ట్రాల మధ్య సంత్సంబంధాల కోసం సీఎంలిద్దరు చేస్తున్న ప్రయత్నమే ఈ భేటీ. గతంలో ఒకే పార్టీలో కలిసి పనిచేసిన చంద్రబాబు, రేవంత్ ఇప్పుడు ముఖ్యమంత్రులు అయ్యారు... దీంతో వీరి భేటీపై ఇరు రాష్ట్రాల ప్రజల్లో ఆసక్తి నెలకొంది. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జరిగే తెలుగు సీఎంల భేటీ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిన్న(శుక్రవారం) సాయంత్రమే ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయనకు తెలంగాణ టిడిపి శ్రేణులు, నగరంలోకి ఆంధ్ర ప్రాంత ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో నగరవ్యాప్తంగా భారీగా టిడిపి ప్లెక్సీలు, పసుపు స్వాగత తోరణాలు ఏర్పాటుచేసారు. 

అయితే చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ, ఇద్దరు సీఎంల భేటీపై ఏర్పాటుచేసిన ప్లెక్సీలు, జెండాలపై వివాదం రాజుకుంది. హైదరాబాద్ లో టిడిపి జెండాలు, చంద్రబాబు ప్లెక్సీల ఏర్పాటును   తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నారు. తెలంగాణలో మళ్లీ ఆంధ్రోళ్ళ పెత్తనం మొదలయ్యిందనేది ఈ పోస్టుల సారాంశం. ఇలా చంద్రబాబు, రేవంత్ భేటీ వేళ తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని బిఆర్ఎస్ తెరపైకి తెచ్చింది... గురువు చంద్రబాబు కోసం శిష్యుడు రేవంత్ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

 

బిఆర్ఎస్ కు టిడిపి, కాంగ్రెస్ కౌంటర్ : 

తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ, హైదరాబాద్ లో టిడిపి ప్లెక్సీల ఏర్పాటుపై చేస్తున్న విమర్శలకు టిడిపి నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. గతంలో అనేకసార్లు వైఎస్ జగన్, కేసీఆర్ భేటీ అయ్యారుగా... మరి అప్పుడెందుకు ఇలాగే ఆత్మగౌరవం అటూ మాట్లాడలేదు అంటూ బిఆర్ఎస్ నేతలను ప్రశ్నిస్తున్నారు. మీరు చేస్తే ఒప్పు... అదే పని ఇతరులు చేస్తే తప్పా..!! అంటూ నిలదీస్తున్నారు.

ఇక చంద్రబాబుతో రేవంత్ భేటీని తప్పుబట్టేలా తెలంగాణలో మళ్ళీ ఆంద్రోళ్ల పెత్తనం మొదలయ్యిందంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ కాంగ్రెస్ సీరియస్ అవుతోంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు పూర్తయ్యింది... అయిన ఇరురాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం కాలేదు... గత బిఆర్ఎస్ ప్రభుత్వం, సీఎంగా చేసిన కేసీఆరే ఏనాడు వీటి పరిష్కారం కోసం ప్రయత్నించలేదు... కానీ ఇప్పుడు రేవంత్ చొరవ చూపుతుంటే విమర్శలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అంటే విభజన సమస్యలు పరిష్కారమవడం బిఆర్ఎస్ కు ఇష్టం లేదా..? అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. 

ఇద్దరు సీఎంలు చర్చించే అంశాలివే..: 

తెలుగు సీఎంలు చంద్రబాబు, రేవంత్ భేటీపై జరుగుతున్న వివాదాన్ని పక్కనబెడితే... ఇప్పటికే ఈ భేటీ కోసం ప్రజా భవన్ లో ఏర్పాట్లు పూర్తిచేసారు. సాయంత్రం 6 గంటలకు సీఎంలిద్దరు ప్రజా భవన్ లో సమావేశం విభజన సమస్యలపై చర్చిస్తారు. 

ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 లో చేర్చిన సంస్థల ఆస్తుల విభజనపై చంద్రబాబు, రేవంత్ ప్రధానంగా చర్చించనున్నారు.  షెడ్యూల్ 9 లో చేర్చిన 91 సంస్థల్లో 68 సంస్థల ఆస్తులు, అప్పులపై ఇరురాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.... మిగిలిన 23 సంస్థలపై వివాదం సాగుతోంది. దీన్ని కూడా ఈ భేటీలో పరిష్కరించుకోడానికి సీఎంలు చర్చించనున్నారు. 

ఇక స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్, విద్యుత్ బకాయిలు, 15 ఎయిడెడ్ ప్రాజెక్టుల మధ్య అప్పుల పంపిణీ, ఉద్యోగుల మార్పిడి, లేబర్‌సెస్ పంపిణీ,  ఉమ్మడి సంస్థల ఖర్చు సొమ్మును తిరిగి చెల్లించడం, హైదరాబాద్‌లో 3 భవనాల పంపకాలు నిలుపుదల తదితర అంశాలను ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు. ఈ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, జనార్ధన్‌రెడ్డి, కందుల దుర్గేష్, చీఫ్ సెక్రటరీ, ఆర్థిక, ఇతర శాఖల కార్యదర్శులు పాల్గొననున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios