తెలంగాణ ఎన్నికల తీర్పు  దేశంలో కీలకం కానుందని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  అభిప్రాయపడ్డారు

కోదాడ: తెలంగాణ ఎన్నికల తీర్పు దేశంలో కీలకం కానుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 11 తర్వాత కేసీఆర్ అపద్ధర్మ సీఎం అవుతారన్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లోనే రెస్ట్ తీసుకోవాల్సిందేనని చెప్పారు. కేసీఆర్‌కు ఇవే చివరి ఎన్నికలని బాబు అభిప్రాయపడ్డారు.

కోదాడలో బుధవారం నాడు నిర్వహించిన ప్రజా కూటమి సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
అభివృద్ధి ఫలాలను కేసీఆర్ ఫ్యామిలీ అనుభవిస్తోందని చంద్రబాబునాయుడు విమర్శించారు.ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఇంటికి పంపాలని చంద్రబాబునాయుడు ప్రజలను కోరారు.

రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోడీలు ప్రజలను మోసం చేశారన్నారు.రేవంత్ రెడ్డిని హైడ్రామా అరెస్ట్ చేశారని బాబు చెప్పారు. రేవంత్ రెడ్డి బెడ్రూమ్‌లో నిద్రపోతోంటే తలుపులు పోగోట్టి అరెస్ట్ చేయడంపై హైకోర్టు కూడ తప్పు బట్టిందన్నారు.

రేవంత్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికమని చెప్పారు. భయపెడితే భయపడుతామా అని కేసీఆర్‌ను ఉద్దేశించి బాబు వ్యాఖ్యానించారు. అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై బాబు నిప్పులు చెరిగారు.

తెలంగాణ ఎన్నికల తీర్పు దేశంలో కీలకం కానుందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రజా కూటమి అధికారంలోకి వస్తోందన్నారు. కేసీఆర్‌ తీరు అందితే జుట్టు అందకపోతే కాళ్లు అనే తీరులో కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు.

అహంభావంతో మాట్లాడే వ్యక్తులను ఇంటికి పంపాలని కేసీఆర్‌ గురించి బాబు వ్యాఖ్యానించారు. డిసెంబర్ 11 తర్వాత కేసీఆర్ అపద్ధర్మ సీఎంగా మారుతారన్నారు. అంతేకాదు కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లోనే రెస్ట్ తీసుకొంటారన్నారు. కేసీఆర్ కు ఇవే చివరి ఎన్నికలని బాబు జోస్యం చెప్పారు.