పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఏదీ ? అధికారికంగా ఉత్తర్వులు రాలేదన్న హైదరాబాద్ పోలీసులు..
పెండింగ్ చలాన్లపై ఇంకా ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. తాను పెండిండ్ చలాన్లపై డిస్కౌంట్ పొందలేకపోతున్నానని ఓ యూజర్ ట్విట్టర్ లో అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది.
తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్లు నేటి నుంచి అందుబాటులోకి రావాల్సి ఉన్నప్పటికీ.. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇంకా పోలీసు అధికారులకు రాలేదు. అందుకే తెలంగాణ స్టేట్ పోలీసులు ఇంటిగ్రేటెడ్ ఈ-చలాన్ పోర్టల్ పాత ఫైన్లపై ఎలాంటి తగ్గింపు కనిపించడం లేదు. అయితే వాహనదారులు దీని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదే విషయంపై స్పష్టత కోరుతూ ఓ వాహనదారుడు ట్విట్టర్ లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసును ప్రశ్న అడిగాడు. తాను ట్రాఫిక్ చలాన్లు కట్టేందుకు ప్రయత్నిస్తున్నానని, కానీ అక్కడ 80 శాతం డిస్కౌంట్ చూపించడం లేదని పేర్కొన్నాడు. ఈ డిస్కౌంట్లు ఇంకా మొదలు కాలేదా ? అని ప్రశ్నించాడు. దానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ సమాధానం ఇచ్చింది.
‘‘చలాన్ల డిస్కౌంట్ల గురించి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో మాకు చాలా ట్వీట్లు, మెసేజ్ లు వస్తున్నాయి. కానీ దీనిపై మాకు ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదు. అది అందిన వెంటనే మా అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో దానిని తెలియజేస్తాం’’ అని పేర్కొన్నారు.
వాస్తవానికి డిసెంబర్ 26వ తేదీ (నేటి నుంచి) నుంచి 2024 జనవరి 10 వరకు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్లు ఇవ్వాలని ఈ నెల 22వ తేదీన నిర్ణయించారు. వాహనం కేటగిరీని బట్టి డిస్కౌంట్లను ప్రతిపాదించారు. షెడ్యూలు ప్రకారం ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. పెండింగ్ చలాన్లపై టూవీలర్లకు, ఆటోలకు 80 శాతం, తోపుడు బండ్లు, చిరు వ్యాపారులకు 90 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. తేలికపాటి మోటారు వాహనాలు (ఎల్ఎంవీ), కార్లు, జీపులు, భారీ వాహనాలపై 60 శాతం డిస్కౌంట్ ను నిర్ణయించారు.