హైదరాబాద్: ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు రచించిన వ్యూహం ఫలించినట్లే కనిపిస్తోంది. ప్రజా కూటమి పేరుతో తెలుగుదేశం, కాంగ్రెసు, సిపిఐ, టీజీఎస్ ఒక్కటైనప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును పూర్తి స్థాయిలో తన వైపు తిప్పుకోలేకపోయాయి. 

బిజెపి సీట్లు గెలుచుకోకపోయినా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడంలో గణనీయమైన పాత్ర పోషించిందనే చెప్పాలి. పలు చోట్ల బిజెపి అభ్యర్థులు ముఖాముఖి పోటీని దెబ్బ కొట్టి త్రిముఖ పోటీ వాతావరణాన్ని కల్పించారు. బిజెపి అభ్యర్థులు గణనీయమైన ఓట్లను చీల్చుకోవడం టీఆర్ఎస్ కు కలిసి వచ్చిందనే చెప్పాలి.

అదే సమయంలో సిపిఎం నేతృత్వంలో ఏర్పడిన బిఎల్ఎఫ్ కూడా టీఆర్ఎస్ విజయానికి చేయూత ఇచ్చినట్లు భావించవచ్చు. వివిధ సామాజికవర్గాలకు చెందిన సంఘాలతో, చిన్నపాటి పార్టీలతో సిపిఎం కూటమి కట్టింది. దాదాపు 109 స్థానాల్లో బిఎల్ఎఫ్ తన అభ్యర్థులను పోటీకి దించింది. ఈ బిఎల్ఎఫ్ అభ్యర్థులు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చినట్లు చెప్పవచ్చు. 

బిజెపితో కేసిఆర్ చేతులు కలిపారనే కాంగ్రెసు, తెలుగుదేశం ప్రచారం అసలు పనిచేయలేదు. షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు ఫలితం ఇచ్చినట్లు చెప్పవచ్చు. మజ్లీస్ తో స్నేహం కూడా ముస్లిం మైనారిటీలో టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడానికి కారణంగా భావించవచ్చు.