సిరిసిల్ల: ప్రభుత్వ ఉద్యోగాలు వస్తూ తమ జీవితాలు బాగుపడతాయని... అలా జరగాలంటూ తెలంగాణ ఏర్పాటు ఒక్కటే మార్గమని భావించి చాలామంది యువత స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే  తమ పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనూ వారికి నిరాశ తప్పలేదు. రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు గడుస్తున్నా ప్రభుత్వ ఉద్యోగాలు రాక తీవ్ర మనస్థాపంతో నిరుద్యోగులు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవలే ఓ నిరుద్యోగి బలవన్మరణానికి పాల్పడగా తాజాగా మరో యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నారు.  రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. 

పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా  కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన ముచ్చర్ల కొమురయ్య, రామవ్వ దంపతుల కుమారుడు మహేందర్ యాదవ్(30). కొన్నేళ్లక్రితమే కరీంనగర్ లో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ఈ సమయంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. యాదవ విద్యార్థుల కోసం అనేక పోరాటాలు చేసిన మహేందర్ ప్రస్తుతం యాదవ విద్యార్థి ఫెడరేషన్ వ్యవస్థాపకుడిగా కొనసాగుతున్నారు. 

అయితే ఇంజనీరింగ్ పూర్తవడం, అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో హైదరాబాద్ కు చేరుకుని ప్రిపరేషన్ ప్రారంభించాడు మహేందర్. అయితే కాలం గడిచిపోతూ వయసు మీరిపోతున్నా ఉద్యోగం రాకపోకపోవడంతో తీవ్ర డిప్రెషన్ కు లోనయ్యాడు. దీనికి తోడు కుటుంబసభ్యులు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మరింత వేధనకు గురయ్యాడు. దీంతో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. 

read more  ఉద్యోగం రావడం లేదని పురుగుల మందు తాగిన విద్యార్థి మృతి (వీడియో)

ఇటీవలే ఓ వేడుక కోసం స్వగ్రామాని చేరుకున్న మహేందర్ గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు కనపడక పోవడంతో కుటుంబసభ్యులు వెతకగా బావిలో శవమై కనిపించాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బావిలోని యువకుడి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.