తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ అరవింద్ రెడ్డి, కె.రామిరెడ్డి, కె. లిఖిత్‌రెడ్డిలను సోమవారం అరెస్ట్ చేశారు.

వెంకటేశ్వర హెల్త్‌కేర్ ఎండీగా కొనసాగుతున్న డాక్టర్ అరవింద్ రెడ్డి.. జాయింట్ డైరెక్టర్ పద్మతో కలిసి అక్రమాలకు పాల్పడ్డట్లుగా దర్యాప్తులో తేలింది. ఈఎస్ఐకి పరికరాలు సరఫరా చేసిన అరవింద్ రెడ్డి కోట్లలో దండుకున్నట్లుగా తెలుస్తోంది.

2013 నుంచి ఆయన అక్రమాలకు తెరదీశారని ఏసీబీ అధికారులు తెలిపారు. వీరి అరెస్ట్‌తో ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్‌ల సంఖ్య 13కి చేరింది.

ఫార్మా కంపెనీ ఎండి సుధాకర్ రెడ్డితో కలిసి అక్రమాలకు పాల్పడినట్టు అభియోగాలతో సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్న నాగలక్ష్మిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే

ఎనిమిదిన్నర కోట్ల రూపాయాల మందుల కొనుగోలు వ్యవహారంలో ఆమె పాత్ర ఉందని తెలుస్తోందని ఫార్మా కంపెనీ ఎండీ సుధాకర్, నాగలక్ష్మి కలిసి పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడినట్టుగా ఏసీబీ గుర్తించింది. 

లైఫ్‌ కేర్ డ్రగ్స్ ఎండీ సుధాకర్ రెడ్డిని అవినీతి ఆరోపణలతో పాటు కుంభకోణంలో ఇతరులతో కుమ్మక్కయ్యారనే అభియోగాలతో శనివారం నాడు అరెస్ట్ చేసింది. డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఇతర అధికారులతో కలిసి కుట్ర పన్నినట్టుగా  ఏసీబీ అధికారులు చెప్పారు.

రూ. 8.25 కోట్ల మందుల కొనుగోలు ఆర్డర్‌ను  సుధాకర్ రెడ్డి సంపాదించినట్టుగా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.