సూర్యాపేట: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాళీ చేసిన హుజూర్ నగర్ సీటుపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) టీకెట్ కోసం మరో ఎన్నారై ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఓటమి పాలైన శానంపూడి సైదిరెడ్డికి టికెట్ విషయంలో తాజాగా రంగంలోకి దిగిన ఎన్నారై దొంతిరెడ్డి నరసింహా రెడ్డి నుంచి తీవ్రమైన పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. 

శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గుండ్లపల్లికి చెందినవారు కాగా, దొంతిరెడ్డి నరసింహా రెడ్డి కూడా ఇదే నియోజకవర్గంలోని మట్టంపల్లి మండల కేంద్రానికి చెందినవారు. దొంతిరెడ్డి నరసింహా రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావుతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 

దొంతిరెడ్డి నరసింహా రెడ్డి అమెరికాలో ప్రముఖ విశ్వ విద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా లోని అమెరికా నేషనల్ కాన్సర్ ఇనిస్టిట్యూట్ లో శాస్త్రవేత్త గా పనిచేస్తున్నారు. 
మట్టంపల్లికి చెందిన ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. 

అమెరికాలో ప్రతి తెలుగు సంస్థకి, ఆ సంస్థల ప్రెసిడెంట్స్ కి ఆయన సుపరిచితుడని అంటున్నారు. ఆయనకు జిల్లా మంత్రికి చాలా దగ్గర బంధుత్వం ఉందని, ఆయనకు ఒక ప్రముఖ వెబ్ టివి ఛానల్ కూడా ఉందని అంటున్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. 

జగన్ కోసం ఆయన ఓ పాట రాసినట్లు తెలుస్తోంది. అది ప్రచారంలో ఉర్రూతలూగించిందని చెబుతున్నారు. యువకుడు, విద్యావంతుడు అమెరికాలో కాన్సర్ విభాగంలో అత్యుత్తమ జర్నల్స్ లో ఇతని గురించి ప్రచురించారని, ప్రపంచంలోని మేటి సైన్స్ జర్నల్ ఇతని రీసెర్చ్ ని ప్రచురించిందని అంటున్నారు. దొంతిరెడ్డి నరసింహా రెడ్డి అత్తగారిల్లు గరిడేపల్లి మండలం అని తెలుస్తోంది.