తెలంగాణ లో ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ పోటీచేసిన 119 స్థానాల్లో 88 చోట్ల గెలుపొందింది. ఎన్నికల ప్రక్రియ ముగిసినా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఇవాళ ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లో చేరడంతో ఆ సంఖ్య 90 కి చేరింది. 

ఇవాళ ఉదయం రామగుండం స్వతంత్ర ఎమ్మెల్యే కోరుగంటి చందర్ రావు కేటీఆర్‌ తో చర్చించి టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు వెల్లడించారు. తాజాగా మరో స్వతంత్ర ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించాడు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా గెలిచిన రాముల్ నాయక్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ భేటి అనంతరం టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు రాములు నాయక్ ప్రకటించారు. 

గతంలో రామగుండం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించిన చందర్ రావుకు నిరాశ ఎదురయ్యింది. సిట్టింగ్ లకే మళ్లీ అవకాశం ఇవ్వడంలో సోమారపు సత్యనారాయణ రామగుండం నుండి మరోసారి పోటీకి దిగారు. దీంతో చందర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. గెలుపు తర్వాత తాజాగా మళ్లీ సొంత గూటికి చేరారు. 

రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీ తరపున వైరాలో ఎమ్మెల్యే బరిలో నిలవాలని భావించాడు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోవాల్సి వచ్చింది. దీంతో రాములు నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొంది తాజాగా టీఆర్ఎస్ లో చేరనున్నట్లు  ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ బలం 90 కి చేరింది.