కార్వీ కన్సల్టెన్సీ  ఎండీ పార్థసారథిపై మరో కేసు నమోదైంది. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.500 కోట్ల రుణం తీసుకున్న పార్థసారథి.. కస్టమర్ల ఖాతాలను  తనఖా పెట్టి రుణాలను తీసుకున్నారనే అభియోగంపై కేసు నమోదైంది.

కార్వీ కన్సల్టెన్సీ ఎండీ పార్థసారథిపై మరో కేసు నమోదైంది. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.500 కోట్ల రుణం తీసుకున్న పార్థసారథి.. కస్టమర్ల ఖాతాలను తనఖా పెట్టి రుణాలను తీసుకున్నారనే అభియోగంపై కేసు నమోదైంది. కేసును సైబరాబాద్ ఎకనమిక్ వింగ్ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే సీసీఎస్‌లో పార్థసారథిపై మూడు కేసులు నమోదయ్యాయి. పీటీ వారెంట్‌పై పార్థసారథిని కస్టడీలోకి తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. 

అంతకుముందు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ కన్సల్టెన్సీ ఎండీ పార్థసారథిని కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం అనుమతి మేరకు రెండు రోజుల పాటు సీసీఎస్ పోలీసులు పార్థసారథిని ప్రశ్నించనున్నారు. కస్టమర్ల పేర్లు కంపెనీ పేర్లుగా నమ్మించి బ్యాంకుల నుంచి కోట్లల్లో రుణాలు పొందింది కార్వీ సంస్థ. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో వున్నారు పార్థసారథి. 

ALso Read:కార్వీలో అక్రమాలు: సీసీఎస్ కస్టడీకి ఎండీ పార్థసారథి.. నాంపల్లి కోర్ట్ అనుమతి

కాగా, కార్వీ కన్సల్టెన్సీలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. రూ. 3 వేల కోట్లకు పైగా కుచ్చుటోపీ పెట్టినట్లు పోలీసులు నిర్థారించారు. దాదాపు లక్షా 20 వేల మంది కస్టమర్లను మోసం చేసినట్లుగా గుర్తించారు. వీరిలో 80 వేల మంది కస్టమర్లకు సెబీ హామీ ఇచ్చింది. ఇప్పటికే కార్వీ ఛైర్మన్ పార్థసారథిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీసీఎస్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.