కొండగట్టు అంజన్న సన్నిధిలో పవనన్న ... ఏపీ డిప్యూటీ సీఎంకు తెలంగాణోళ్ల ఆత్మీయ స్వాగతం
పవన్ కల్యాణ్ రాకతో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద సందడి నెలకొంది. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంకు తెలంగాణ స్టైల్లో ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు
Pawan Kalyan : జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలోని ప్రముఖ దేవాలయం కొండగట్టును సందర్శించారు. ఉదయమే హైదరాబాద్ నుండి రోడ్డుమార్గంలో జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి ఏపీ డిప్యూటీ సీఎం బయలుదేరారు. మార్గమధ్యలో ఆయనకు జనసేన, బిజెపి నాయకులతో మెగా ఫ్యాన్స్ ఘనస్వాగతం పలికారు. ఆయనను గజ మాలతో సత్కరించి ఆంజనేయస్వామ స్వామి చిత్రపటాన్ని, కత్తిని బహూకరించారు అభిమానులు.
ఇలా భారీగా అభిమానులు వెంటరాగా కొండగట్టు ఆలయానికి చేరుకున్నారు పవన్ కల్యాణ్. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అధికారులు దగ్గరుండి పవన్ కు స్వామివారి దర్శనం చేయించారు. ఇలా ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కు చెల్లించుకున్నారు పవన్ కల్యాణ్. ఆయనకు అర్చకులు తీర్థప్రసాదాలు ఇచ్చి వేదాశీర్వచనం అందించారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి కొండగట్టుకు విచ్చేసారు పవన్ కల్యాణ్. దీంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయగా... ఇతర శాఖల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. అయితే పవన్ ను చూసేందుకు భారీగా అభిమానులు తరలిరావడంతో వారికి కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టతరమైంది.
ఇక ప్రస్తుతం వారాహి దీక్షలో వున్న పవన్ కాషాయ దుస్తుల్లో కనపిస్తున్నారు. ఇలా ఆధ్యాత్మిక వేషధారణలోని పవన్ చూసి అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. పవన్ వెంట భారీగా కాన్వాయ్ తో జనసేన నాయకులు కూడా కొండగట్టుకు చేరుకున్నారు. ఇలా పవన్ రాకతో కొండగట్టు ఆలయంవద్ద సందడి నెలకొంది.