ఇద్దరు టెక్కీస్.. గంజాయి అమ్ముతూ పోలీసులకు చిక్కిన సంఘటన హైదరాబాద్ నగరంలోని బోరబండలో చోటుచేసుకుంది. న్యూఇయర్ వేడుకలు దగ్గరపడుతున్న సమయంలో ఇప్పటికే నగరంలో డ్రగ్స్, గంజాయి లాంటి మత్తుపదార్థాల అమ్మకాలు పెరిగిపోయి. ఈ నేపథ్యంలో పోలీసులు దీనిపై నిఘా పెట్టగా.. ఇద్దరు టెక్కీలు దొరికారు.

బొరబండలో గంజాయి సరఫరా జరుగుతుందని వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడులు చేయగా.. స్మగ్లర్లతోపాటు ఇద్దరు టెక్కీలు కూడా ఉన్నారు. మొత్తం 9.5కిలోల గంజాయి లభించగా... టెక్కీల దగ్గర 1.15కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బొరబండలో నివసించే టెక్కీ సాయి చరణ్(24), అతని రూమ్ మెట్ శ్రీకాంత్(23) లు గత కొద్దిరోజులుగా అమీర్ పేట, ఎస్ఆర్ నగర్, బంజారాహిల్స్, మాదాపూర్ ప్రాంతాలలోని యువకులకు అమ్ముతున్నట్లు తెలిసింది. ఈ గంజాయిని విశాఖ జిల్లా అరకు నుంచి వీరికి సరఫరా అయినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల దగ్గర నుంచి గంజాయితోపాటు బైక్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

25గ్రాముల గంజాయి రూ.500, 50గ్రాముల గంజాయి రూ.1000లకు అమ్ముతున్నట్లు నిందితులు అంగీకరించారు. గత రెండు సంవత్సరాలుగా వీరు ఈ గంజాయి అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. అరకులో కేజీ గంజాయిని రూ. 3,500లకు కొనుగోలు చేసి ఒక్కడ రూ.25గ్రాముల గంజాయి ని రూ.500నుంచి రూ.1000కి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.